Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలి
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్తచట్టం తేవాలి
- త్వరలోనే 'జర్నలిస్టుల జేఏసీ' ఏర్పాటు : టీడబ్ల్యూజేఎఫ్ రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు వచ్చేనెలలోగా ఇండ్లస్థలాలు ఇస్తామనీ, ఇందుకోసం కొత్తచట్టం తెస్తామనీ, సుప్రీం కోర్టులో కేసు పరిష్కారం కోసం అధికారులను ఢిల్లీకి పంపిస్తామంటూ ఇటీవల హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు ప్రకటించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సంక్షేమానికి కొత్త చట్టం తేవాలని సూచించారు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలు, హౌజింగ్ సొసైటీలు, సీనియర్ జర్నలిస్టులతో కలిపి 'జర్నలిస్టుల జేఏసీ' ఏర్పాటు చేస్తామన్నారు. 'జర్నలిస్టుల ఇండ్లస్థలాలు-మన కర్తవ్యం'అనే అంశంపై టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాక్షి మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్. దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీలకు కేటాయించిన భూమిని రక్షించుకోవాలని చెప్పారు. సుప్రీం కోర్టులో కేసున్నా రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇచ్చే అవకాశముందని అన్నారు. జర్నలిస్టుల జేఏసీ ఏర్పాటు చేసి నిరంతర కార్యచరణ రూపొందించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. టీజేఎఫ్ అధ్యక్షులు పల్లె రవికుమార్ మాట్లాడుతూ పేట్ బషీరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ప్రభుత్వం ఎవరికీ కేటాయించబోదని స్పష్టం చేశారు. ఒకవేళ కార్పొరేట్ సంస్థలకు ఆ భూమిని కేటాయిస్తే కుటుంబాలతో సహా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సంక్షేమానికి కొత్తచట్టం తేవాలని కోరారు. సీఎం కేసీఆర్ హామీ ప్రకారం మార్చిలోగా ఇండ్లస్థలాలు ఇచ్చే ప్రక్రియను పూరి చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్, జవహర్లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీలకు కేటాయించిన భూములను వాటిపరిధిలోనే ఉంచాలంటూ తీర్మానం చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు, శాసనసభాపక్ష నేతలను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకటాచారి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇచ్చేందుకు కొత్తచట్టం తెస్తామనడం మంచిదేనని అన్నారు. అయితే నెలరోజుల్లో సుప్రీం కోర్టులో కేసు పరిష్కారమవుతుందా?అని అన్నారు. ఎన్ఏజే నాయకులు జి ఆంజనేయులు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అధికార యంత్రాంగం దృష్టికి నిరంతరం తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ మాజీ కార్యదర్శి ఎంఎస్ హష్మీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి అసెంబ్లీలో ఈ అంశం లేవనెత్తేలా ప్రయత్నించాలని కోరారు.
జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇచ్చేందుకు కొత్తచట్టం తెస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పి ఆనందం అన్నారు. ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలంగాణ చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్‌బాబు అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాధిక్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలివ్వాలంటూ సంతకాల సేకరణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఈశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు దేవేందర్, టీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి నర్సింగ్‌రావు, నాయకులు పాండు, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, నిరంజన్, నాయకులు పద్మరాజు, రాజశేఖర్, రఘు, నాగవాణి, మధుకర్, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు.