Authorization
Wed April 09, 2025 02:19:13 am
- ఏఐడీఈఎఫ్ నేత జీటీ గోపాలరావు విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రక్షణ రంగ ఉద్యోగులను మోసం చేసిందని అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య(ఏఐడీఈఎఫ్) జాతీయ సహాయ కార్యదర్శి జీటీ గోపాలరావు విమర్శించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు కార్పొరేషన్లుగా విభజించి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు చేయడం మూలంగా ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చిన మోడీ సర్కారు, ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నదని వివరించారు. ఆయా సమస్యలపై ఏఐడీఈఎఫ్ ప్రతినిధులతో చర్చలు జరపకపోవడాన్ని తప్పుబట్టారు. రెండేండ్లు డిప్యూటేషన్లు లేకుండా చేసిందనీ, పనిగంటలను పెంచిందని అన్నారు. ఓటీలు సైతం బంద్ చేసిందని తెలిపారు. రక్షణ రంగ కోనుగోళ్లను 68 శాతం మేర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కాకుండా ఎక్కడి నుంచైనా కొనుగోలుచేయవచ్చని బడ్జెట్లో పేర్కొనడాన్ని ఖండించారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మరింత నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నిందని విమర్శించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, అందులో పనిచేసే ఉద్యోగుల సమస్యలపై ఏఐడీఈఎఫ్ జాతీయ స్థాయి సమావేశంలో చర్చించి తీర్మానాలు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ఏఐడీఈఎఫ్ లేఖ రాసినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.