Authorization
Tue April 08, 2025 08:23:05 pm
- తప్పుడు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి... లేదంటే ఉద్యమమే : మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగాన్ని మార్చాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహారించుకునేంత వరకు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మందకృష్ణ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు మొదటి నుంచి అంబేద్కరంటే తీవ్ర ద్వేషం ఉందని చెప్పారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదనే కోపం ఉందన్నారు. కేంద్రం తీసుకున్న ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్ర ఎంపీలు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆత్మ పౌరహక్కుల చుట్టూ తిరిగిందని చెప్పారు. పౌరహక్కులంటే గిట్టని కేసీఆర్‌కు ఈ రాజ్యాంగం ఎలా నచ్చుతుందని ప్రశ్నించారు.ధర్నాలు, నిరసనలు, మీటింగ్‌లు పెట్టుకోవటాన్ని సహించని వారికి రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన రావడం సహజమేనన్నారు. అయితే..రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్ల చదువు, పదవి పొందుతున్న కడియం శ్రీహరిలాంటి వారు సైతం కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారనీ, వీరు పూర్తిగా దళిత ద్రోహులుగా మారారని విమర్శించారు. కేసీఆర్ ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనీ లేదంటే ఈ నెల 10న అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ తర్వాత 12న రౌండ్ టేబుల్ సమావేశాలు, 13న రాష్ట్ర కేంద్రంలో రాజ్యాంగ అనుకూల, ప్రజాస్వామిక, పౌరహక్కుల సంఘాలు, పార్టీలు, సంస్థలతో రౌండ్‌టేబుల్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగిడి సత్యం మాదిగ, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, వీఎస్ రాజు, వనం నర్సింహ్మా, అరుణ్‌కుమార్, దుర్గాభాయి, సుజాత తదితరులు పాల్గొన్నారు.