Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పద విషయాలు పట్టని సర్కారు
- పెద్దల తప్పులు కనిపించవా ?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటనో, మరేదైనా లైంగిక వేధింపుల ఘటనో ప్రజల్లో చర్చకు దారితీసి ప్రభుత్వంవైపు వేళ్లు చూపిస్తున్నప్పుడు 'చట్టం..తన పని తాను చేసుకుపోతుంది' అని సాధారణంగా ప్రభుత్వం సెలవిచ్చేమాట. ఉన్నతాధికారులు కూడా అదే మాటను వల్లెవేస్తుంటారు. ఆ బాటలోనే వెళుతుంటారు. ఇదీ చాలా సాధారణంగా చోటుచేసుకునే పరిణామం. సామాన్యులు చట్టం తెలియక చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తే నానా యాగీ చేసీ కేసులు పెట్టి జైళ్లకు పంపి మరీ అమలుచేసే అధికార యంత్రాంగం, అదే పెద్దల విషయంలో మాత్రం ఆ హడావిడి, తొందర కనిపించదు. చావు కబురు చల్లగా చెప్పినట్టు ' మాకు ఫిర్యాదు అందలేదు..' అంటూ నీళ్లు చల్లే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇదీ కూడా సర్వసాధారణంగా జరిగే పరిణామమే. రాజకీయాల్లో ఇవి మామూలేనని చెప్పేవాళ్లూ ఉంటారు. వినేవాళ్లూ ఉంటారు. జనం చూస్తూ, వింటూ ముందుకు సాగిపోతుంటారు. ఇటీవల రాష్ట్రంలో సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూతురి వివాహం పెద్ద సంచలనమే సృష్టించింది. పెండ్లి, విందు, ఇతర కార్యక్రమాలన్నీ ఐదు నక్షత్రాల హోటళ్లల్లో సదరు సీనియర్ ఐఎఎస్ అధికారి ఘనంగా నిర్వహించారంటూ పత్రికల్లో వార్తలోచ్చాయి. సోషల్మీడియా కోడైకూసింది. నానా హంగామా నడిచింది. కానీ ఎక్కడడైతే చురుగ్గా ఉండాలో, ఎవరైతే వేగంగా కదిలి చర్యలు తీసుకోవాలో అక్కడ మాట మాత్రంగా కూడా చడీచప్పుడు లేదు. అసలు పెద్ద విషయమే కాదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడమనేది ముక్కున వేలేసుకునే పరిస్థితే. ఐఎఎస్ అధికారి కూతురి పెండ్లి చేసుకుంటే చర్యలు తీసుకోవడం ఏంటీ ? అనే డౌటనుమానం సహజంగానే వస్తుండవచ్చు. ఆ పెండ్లి తన సొంత పైకంతో చేస్తే ఇంత లొల్లి ఎందుకుంటుంది ? గంత యాగీ ఎందుకు జరుగుతుంది. అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. సదరు పెద్దమనిషి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో అత్యధిక కాంట్రాక్టులు దక్కించుకుంటున్న మెఘా ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఆర్థిక సహకారం అందుకున్నారనే ఆరోపణలు, విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు పనులు, బిల్లుల మంజూరులో సదరు ఐఎఎస్ అధికారి సంబంధిత సంస్థ పట్ల ఉదారంగా వ్యవహరించినందుకే 'క్విడ్ప్రోకో' చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే సంబంధిత సంస్థ, ఆ సీనియర్ ఐఏఎస్ కూతురు పెండ్లిని అంగరంగం వైభవంగా చేసిందనే ప్రచారం ఆ నోటా , ఈ నోటా పాకి, నాని చివరకు పత్రికలకు ఎక్కింది. కానీ, పిల్లి కండ్లు మూసుకుని పాలుతాగుతూ నన్నేవరూ చూడటం లేదని అనుకున్నట్టు, సర్కారు పరిస్థితి అలాగే ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందా ? అని అందరూ ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. ఫిర్యాదు రాలేదు కదా అని తనలో తాను అనేసుకుని మిన్నకుంటుందా ? లేదా చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పెద్దలకో న్యాయం ? పేదలకో న్యాయం అన్నట్టుగా ఉందీ సర్కారు పరిస్థితి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మేధావుల్లోనూ చర్చకు అవకాశం కలిగింది. నచ్చినవారిని రక్షించుకుంటూ, గిట్టనివారిపై సర్కారు కేసులు పెడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ చట్టం..తన పని తాను చేసుకుపోతుందా !? పాలకులను ఎన్నుకునే ప్రజలే దీన్ని తేల్చుకోవాలి.