Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు ఆర్‌యూపీపీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో వల్ల ఇబ్బందులకు గురవుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావును శుక్రవారం ఆర్‌యూపీపీ అధ్యక్షులు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియలో జరిగిన తప్పిదాలను సవరించాలనీ, అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. 13 జిల్లాల్లోనూ భార్యాభర్తలను అనుమతించాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రేడ్-2 హిందీ పండితుల జాబితా తయారీలో జరిగిన తప్పిదాల వల్ల సీనియర్ టీచర్లకు నష్టం జరిగిందని తెలిపారు. 42 మంది పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. 21 జీవో ప్రకారం పరస్పర బదిలీలకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. సీనియార్టీకి రక్షణ కల్పించాలనీ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. పండితుల అప్‌గ్రెడేషన్ జీవోలు అమలు కావాలంటే అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరయ్యేలా చూడాలని సూచించారు.
21 జీవోను సవరించాలి : డీటీఎఫ్
పరస్పర బదిలీల కోసం విడుదల చేసిన 21 జీవోను సవరించాలని డీటీఎఫ్ అధ్యక్షులు ఎం రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పరస్పర బదిలీ కోరుకునే వారిలో ఒక్కరైనా రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం బదిలీ అయి ఉండాలనీ, పాత సర్వీసును కోల్పోతారని నిబంధన విధించడం సరైంది కాదని తెలిపారు. స్థానికతను కోల్పో యిన ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగించేలా జీవో ఉండాలని సూచించారు. 21 జీవోను సవరించి అందరికీ ప్రయోజనం కలిగించాలని కోరారు.
అది ప్రభుత్వ హత్యే : టీఎస్పీటీఏ
శామీర్‌పేట్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన కామేశ్వరరావు వికారాబాద్‌కు బదిలీ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ తెలిపారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ప్రాణాలు తీసుకుంటున్నా నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదని తెలిపారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా అసంబద్ధ 317 జీవోను సవరించాలనీ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.