Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావాలి
- పనులను వేగవంతం చేయండి
- సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్య, అర్అండ్బీ శాఖల ఉన్నతాధికారులతో ఇదే అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఎన్ఎంసీ అధికారుల పరిశీలనకు ముందే అన్ని నిర్మాణాలు, ఇతర సౌకర్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో నాలుగు టిమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్ధాపన చేస్తారని తెలిపారు. పేదలకు ఉచితంగా ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.1,100 కోట్లతో మంజూరు చేశామని గుర్తుచేశారు. దీంతో ఆ నగరం వరంగల్ మెడికల్ హబ్‌గా మారుతుందన్నారు. నిర్మాణంలో ఎన్ఎంసీ నిబంధనలు పాటించాలని సూచించారు. 215.35 ఎకరాల్లో వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నామనీ, ఇందులో 15 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో భారీ భవన సముదాయాన్ని నిర్మిస్తామని చెప్పారు. అక్కడ మొత్తం 2,000 పడకలుంటాయని వివరించారు. స్పెషాలిటీ వైద్యం కోసం 1,200 పడకలను కేటాయిస్తామని వివరించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి సేవలు అందుతాయని చెప్పారు. సూపర్ స్పెషాలిటీల కోసం 800 పడకలు ఉంటాయన్నారు.
ఎయిమ్స్ తరహాలో టిమ్స్
టిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనునున్నదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. గచ్చిబౌలి, సతన్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలని కేసీఆర్ ఆలోచించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటికి ఐదు మెడికల్ కాలేజీల ఉంటే, తెలంగాణ వచ్చాక వాటి సంఖ్య 17కు పెరిగిందన్నారు. మొదటి దశలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు, రెండో దశలో ఎనిమిది, మూడో దశలో నాలుగు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నాయని వివరించారు. మొదటి దశలో భాగంగా మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలో కాలేజీలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని గుర్తుచేశారు. రెండో దశలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మూడో దశలో సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.
కేంద్రం సాయం చేయకున్నా.....
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.