Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని గనుల్లోనూ యంత్రాలను అందుబాటులో ఉంచాలి
- ఉత్పత్తి లక్ష్యాల సాధనలో పూర్తి సహకారం అందించాలి : ఓబీ కాంట్రాక్టర్లకు సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి ఈ ఏడాది నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉపరితల గనుల్లో ప్రతి రోజూ 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను వెలికి తీయాలని ఓబీ కాంట్రాక్టర్లను సింగరేణి డైరె క్టర్లు ఎస్.చంద్రశేఖర్(ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ఫైనాన్స్, పర్సనల్, పీ అండ్ పీ), డి.సత్యనారాయణరావు (ఈఅండ్ఎం) ఆదేశించారు. అందుకవసరమైన యంత్రాలను అన్ని గనుల్లోనూ అందుబాటులో ఉంచాలని సూచించారు. హైదరాబాద్లో ఓబీ కాంట్రాక్టర్లతో వారు వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా డ్రాగ్ల్కెన్, షావెల్స్, డంపర్లు, డోజర్లు తదితర భారీ యంత్రాలు 736 వరకు అందుబాటులో ఉన్నాయనీ, వాటిని సద్వినియోగం చేసుకుంటూ సంస్థాగతంగా రోజూ 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సంస్థాగత యంత్రాలతో 505 లక్షల క్యూబిక్ మీటర్ల బొగ్గు వెలికితీతకుగానూ 443 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయిందన్నారు. నిర్దేశిత లక్ష్యంలో 88 శాతం మేర ఓబీని తీశారనీ, దీన్ని వందశాతానికి తీసుకెళ్లేందుకు వీలుగా యంత్రాల పని గంటలను 14గంటల నుంచి 18గంటలకు పెంచాల్సి న అవసరం ఉందన్నారు. జనవరిలో మణుగూరు లోని పీకే ఓసీలో సంస్థాగత యంత్రాల పనితీరు బాగుందని ఈ సందర్భంగా అభినందించారు. సింగరేణి కాలరీస్-దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా చేపట్టిన 54కిలోమీటర్ల భద్రాచలం - సత్తుపల్లి రైల్వేలైన్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెలాఖరు నాటికి పూర్తయ్యేచూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ మార్గం పూర్తయితే పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే సత్తుపల్లి వద్ద నిర్మిస్తున్న అతి పెద్ద సీహెచ్పీ నిర్మాణం కూడా మార్చి నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. జనవరిలో సగటున 37రేకుల ద్వారా బొగ్గు రవాణా జరగాల్సి ఉండగా సగటున 32రేకుల ద్వారా జరిగిందన్నారు. ఈ నెలలో రోజుకు 34 రేకులకు తగ్గకుండా బొగ్గు రవాణా చేయాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో రోజుకు 2.2 లక్షల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అడ్వైజర్లు, ఈడీలు, జీఎంలు, కార్పొరేట్ జీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.