Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు ఉపయోగపడని రిజర్వాయర్ ఎందుకు ?
- బలవంతంగా ఖాళీ చేయిస్తే ఊరుకోం : ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- చిన్నోనిపల్లి ముంపు బాధితుల ధర్నాకు మద్దతు
నవతెలంగాణ - అలంపూర్
నిర్వాసిత రైతులకు అండగా రైతుసంఘం ఉంటుందని ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి గ్రామంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ వద్ద బాధిత రైతులు చేపట్టిన ధర్నాకు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్తో కలిసి శుక్రవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సారంపల్లి మాట్లాడుతూ.. 17 ఏండ్ల కిందట రైతుల నుంచి సేకరించిన భూములకు తక్కువ పరిహారమిచ్చి ఇప్పుడు గ్రామాన్ని ఖాళీ చేయమని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటివరకు రైతులు ఎవరి పొలాల్లో వారు పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు ఉపయోగం లేని రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడమేంటని ప్రశ్నించారు. సేకరించిన భూములను ఉపయోగించుకోకుండా ఐదేండ్లు పెండింగ్లో పెడితే ఆ భూములు రైతులకే చెందుతాయన్నారు. ఒకవేళ ప్రభుత్వం భూములు సేకరించాలనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువ కంటే మూడు రెట్లు అధికంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత గ్రామాల్లో 18 ఏండ్లు దాటిన వారందరికీ చట్ట ప్రకారం పరిహారమివ్వాలన్నారు. ఉపయోగం లేని రిజర్వాయర్ను రద్దు చేయాలన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల ప్రజలు తమ భూములు ఇవ్వబోమని ప్రజాప్రతినిధుల ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై సీపీఐ(ఎం), రైతుసంఘం తరపున ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని, రైతులంతా ఐక్యంగా నిలబడి విజయం సాధించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ధర్నాలో సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి, కర్నాటక ప్రాంతం రైతుసంఘం నాయకులు వీరన్న గౌడ్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వివి.నరసింహా, పార్టీ గట్టు మండల కార్యదర్శి ఆంజనేయులు, రైతుసంఘం జిల్లా కన్వీనర్ జికె.ఈదన్న తదితరులు పాల్గొన్నారు.