Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎర్పుల స్వామి సంతాప సభ
- పాల్గొన్న కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-మంచాల
ఎర్పుల స్వామి ఆశయ సాధన కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎర్పుల స్వామి సంతాప సభ నిర్వహించారు. మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్ సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో చెరుపల్లి మాట్లాడారు. స్వామి పేద కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ మండల పరిధిలోని అరుట్ల గ్రామంలో ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివి, విద్యార్థి సంఘంలో చేసి విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవాడని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఎర్రజెండాతోనే సాధ్యమని నమ్మి పార్టీలో సభ్యత్వం తీసుకుని ఎత్తిన జెండాను దించకుండా పార్టీలో చురుకుగా పాల్గొనేవాడని తెలిపారు. గ్రామానికి ఉప సర్పంచ్‌గా ఉంటూ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. ముఖ్యంగా మంచాల గ్రామంలో జరిగిన భూ పోరాటంలో జైలుకు కూడా పోయాడని తెలిపారు. మంచాలలో శ్మశానవాటిక ఏర్పాటు చేసిన భూమి అలా సాధించుకున్నదేనన్నారు. రైతుల భూములకు కొత్త పాస్ పుస్తకాల కోసం నిరాహార దీక్ష చేసి పాస్ పుస్తకాలు వచ్చేందుకు కృషి చేశాడని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా పని చేస్తూ వ్యవసాయ, ఉపాధి హామీ కూలీల కోసం అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాదన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు కందుకూరి జగన్, రావుల జంగయ్య, ఎర్పుల నరసింహ, రావుల జంగయ్య, ప్రజాసంఘాలు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.