Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పులు చేసి చదివించిన తల్లిదండ్రులు
నవతెలంగాణ - కొత్తకోట
పీజీ చేసినా ఉద్యోగం రాకపోవడం.. ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం.. ఏదైనా కోచింగ్‌కు తీసుకుందామంటే.. ఇప్పటికే తన చదువు కోసం అప్పు చేసిన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన వెంకటమ్మ-బాలమ్మ దంపతుల కుమారుడు కురుమూర్తి(26) పీజీ వరకు చదివాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే తల్లిదండ్రులు అతని చదువు కోసం అప్పు చేశారు. ఏదైనా ఉద్యోగం వస్తే తమను చూసుకోవడంతోపాటు అప్పు తీర్చుకుంటాడని కష్టపడి చదివించారు. కానీ, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏమీ లేకపోవడంతో కురుమూర్తి నిరాశకు గురయ్యాడు. ఏదైనా కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుని గురువారం రాత్రి తల్లిదండ్రులకు చెప్పారు. రూ.40 వేలు ఖర్చు అవుతుందన్నాడు. అయితే, కష్టపడి ఇంత వరకు చదివించామని, అప్పులు కూడా చేశామని, తమ వద్ద ఇక ఏమీ లేదని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పటికే చేసిన అప్పులు తీరలేదని, పొలం అమ్మి ఇస్తామని, కొన్ని రోజులు ఆగాలని తమ బాధను చెప్పారు. తన వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడటం.. ఉద్యోగం రాలేదన్న బాధ.. కోచింగ్‌కు డబ్బుల్లేవన్న నిరాశలో మనస్తాపానికి గురైన కురుమూర్తి శుక్రవారం ఉదయం గ్రామంలోని గుడి దగ్గర పురుగుల మంది తాగాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తకోట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మహబూబ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.