Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలపై అక్రమ కేసులను ఎత్తేయాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం.. బెల్టుషాపుల తెలంగాణగా మార్చిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో బెల్ట్ షాపులు రద్దు చేయాలని పోరాడి జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. సభలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. బెల్టుషాపులకు వ్యతిరేకంగా మహిళలు, యువకులు పోరాడటం అభినందనీయమన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పని దొరక్క.. తినడానికి తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి సమయాల్లో కూడా ఖజానా నింపుకోవడానికి ఇష్టానుసారంగా మద్యం, బెల్టు షాపులకు ప్రభుత్వం అనుమతినిస్తున్నదన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి మాట్లాడుతూ.. బెల్టు షాపులు రద్దు చేయాలని అడిగినందుకు మహిళలపైనా, దళితులపైనా అక్రమ కేసులు నమోదు చేసి 11 రోజుల పాటు జైల్లో పెట్టారన్నారు. పోలీసులు సరైన విచారణ జరపకుండా అక్రమ కేసులు పెట్టారన్నారు. మరొకరి సహకారం లేకుండా ముందుకు కూడా వెళ్లలేని ఓ అంధురాలిపై, వాకర్ సాయంతో మాత్రమే నడవగలిగే వృద్ధురాలిపైనా కేసులు బనాయించారన్నారు. దీన్నిబట్టి విచారణ ఏ మేరకు జరిగిందో అర్థమవుతుందన్నారు. అక్రమ కేసులను బేషరతుగా ఎత్తేయాలని, బెల్టుషాపులను రద్దు చేయాలని, చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ర్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టిన బెల్ట్‌షాప్ యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసులను ఎత్తేసే వరకు ఐద్వా, కేవీపీఎస్ గ్రామ ప్రజానీకానికి అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. జైలుకు వెళ్లి వచ్చిన వారిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కేవీపీఎస్ జిల్లా సహాయం కార్యదర్శి రాంచందర్, సీపీఐ(ఎం) మండల మండల కార్యదర్శి కే.రాజయ్య కేవీపీఎస్ నాయకులు బాబురావు, రామచందర్, వెంకయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.