Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్క్యులర్ 17022(31) జారీ చేసిన కేంద్రం
- ఉపాధిహామీ చట్టం నిర్వీర్యానికి కుట్ర
కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండేండ్లుగా నిరుద్యోగం పెరిగింది.. ఉపాధి కరువైంది. గ్రామాల్లోనూ పేదలకు ఉపాధి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్నీ పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. ఓ వైపు క్రమంగా నిధుల కేటాయింపులు తగ్గిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు కూలీల అలవెన్సుల్లో కోత విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వేసవిలో నాలుగు నెలల అలవెన్సు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు పని చూపెడుతున్నారు. వారికి రోజు కూలి పేరుతో రూ.245 అందజేస్తారు. వేసవిలో పనులు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో కూలితోపాటు అలవెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంది. వేసవికి తట్టుకోలేక కూలీలు అనారోగ్యం బారిన పడుతుంటారు. అందుకే కూలీలకు అదనంగా అలవెన్సులు చెల్లిస్తారు. ఆ అలవెన్సులు రోజు కూలిని బట్టి పర్సంటేజ్ చొప్పున ఇస్తారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఈ అలవెన్సులు ఇస్తుంటారు. ఫిబ్రవరి 20శాతం, మార్చి 25శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30శాతం, జూన్ 20శాతం అలవెన్స్ ఇస్తారు. అయితే, ఇకపై ఈ అలవెన్స్‌లో కోత పడనుంది.
వచ్చే వేసవి నుంచి అలవెన్సులో కోత
వచ్చే వేసవి నుంచి అదనపు అలవెన్సులో కోత విధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇప్పటికే సర్క్యులర్ నెంబర్ 17022(31) విడుదల చేసింది. దీనిపై కిందిస్థాయి సిబ్బందికి కూడా ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినా.. కూలీలు అనారోగ్యానికి గురైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. వేసవి అలవెన్సుతో వారికి కొంత ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు అందులోనూ కోత పడనుండటంతో కూలీలకు తీవ్ర నష్టం జరగనుంది.
ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే నిధుల కేటాయింపులో భారీ కోత విధించడం ఒక భాగం. పనిచేసే చోట కూలీలకు కనీస వసతులైన తాగునీటి సౌకర్యం, నీడ, పనిముట్లు, ప్రమాదం జరిగితే పరిహారం లాంటి వాటిని ఇవ్వడం లేదు. ఇప్పుడు అలవెన్స్లోనూ కోత విధించడం ఆందోళనకరం. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధిహామీ చట్ట నిర్వీర్యం చర్యలను సహించబోమని, పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం హెచ్చరించింది.
ఉపాధి జాబ్‌కార్డులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7,87,215 మందికి జాబ్‌కార్డులున్నాయి. దాదాపు 21,45,278మంది కూలీలు ఉన్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 3,70,214 కార్డులుండగా.. 8,70632 మంది కూలీలు, సూర్యాపేట 2,61,385 కార్డులుండగా.. 3,48,775 మంది కూలీలున్నారు. యాదాద్రి జిల్లాలో 1,55, 616 జాబ్ కార్డులుండగా 9,25,871 మంది కూలీలున్నారు. దాదాపు 6లక్షల మందికిపైగా ఉపాధి పనులకు వెళ్తున్నారు.
సర్క్యులర్ రద్దు చేయాలి
కూలీలకు వేసవి అలవెన్సులు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలి. లేకపోతే కూలీలను ఐక్యం చేసి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం పన్నిన కుట్రలో భాగమే అలవెన్సుల రద్దు సర్క్యూలర్.
కొండమడుగు నర్సింహా-వ్యవసాయ కార్మిక సంఘం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి