Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవిభక్త కవలలుగా పుట్టిన వీణా-వాణిలకు శస్త్ర చికిత్స చేసి వేరు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మన దేశ వైద్యులే కాకుండా విదేశీ వైద్యులు కూడా వచ్చి వారిని పరీక్షించి శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలకే ముప్పు ఉంటుందని చెప్పారని తెలిపింది. తొమ్మిదేండ్లు నీలోఫర్‌లో ఉన్నారని, ఇప్పుడు తల్లిదండ్రుల వద్ద ఉన్నారనీ, ఇంటర్ చదువుతున్నారనీ, భవిష్యత్‌లో వైద్య ఖర్చులు అవసరమైతే ప్రభుత్వం ఇస్తుందని ప్రభుత్వ ప్రత్యేక జీపీ ఎ.ఎస్.రావు చెప్పారు. దీంతో పిల్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్‌లో వారికి అవసరమైన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. అదే విధంగా వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేయాలనీ, హైదరాబాద్ లేదా వరంగల్‌లో నివాస గృహం ఇచ్చేలా ఆదేశాలు జారీ కోసం 2016లో పిల్ వేసిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, నెలకు వీణ-వాణి కుంటుబానికి రూ.15 వేలు ఇస్తామని వెల్లడించింది. ఇందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడమే కాకుండా ఆ సాయాన్ని కొనియాడింది. పిల్‌పై విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది.
చిన్న నేరాలు చేసిన ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలి
చిన్నపాటి నేరాలకు పాల్పడిన విచారణ ఖైదీల విడుదలకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరైనా పూచీకత్తులు సమర్పించలేని వారినీ, చిన్నచిన్న నేరాల్లో బెయిల్ పొందలేక జైళ్లల్లోనే మగ్గిపోతున్న వారిని గుర్తించి చట్ట ప్రకారం ఆయా కోర్టుల్లో దరఖాస్తులు చేసి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. బెయిల్ మంజూరైనా పేదరికంతో పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక రాష్ట్రంలో 180 మంది జైళ్లల్లోనే మగ్గుతున్నారని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కె. మురళి వేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పూచీకత్తులు సమర్పించలేదని విచారణ ఖైదీలను గుర్తించి వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. తమ ఆదేశాల అమలుపై నివేదికను ఏప్రిల్ 22న జరిగే తదుపరి విచారణలో సమర్పించాలని కోరింది.