Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు సీపీఐ నేత నారాయణ సూచన
- బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంత కాలం టీఆర్ఎస్తో కలిసుంటాం
- కేంద్రబడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యాంగం జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సూచించారు. ఎన్నికల విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. దామాషా పద్ధతిలో ఎన్నికలుండాలని కోరారు. ఇందుకోసం కేసీఆర్ ముందుకొస్తే బాగుంటుందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎంతదూరం వెళ్తే తాము అంతదూరం కలిసొస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అనుకూలంగా మారితే తాము విభేదిస్తామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, తమ పాలనలో ఉన్న రాష్ట్రాల పట్ల ఒక వైఖరినీ, మిగతా రాష్ట్రాల పట్ల మరో వైఖరిని ప్రదర్శిస్తున్నదని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. విభజన హామీల అమలుకు కేంద్రం పూనుకోలేదని చెప్పారు. సామాన్య, మధ్య తరగతి, పేదలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ అనుకూలంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. బీజేపీ వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కలిపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని చెప్పారు. ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తే వారిని ప్రభుత్వం అణచివేసే చర్యలను ఖండించారు. ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. సీఎస్‌గా ఉండే అర్హత సమీర్‌శర్మకు ఉందా?అని ప్రశ్నించారు. జిల్లాల విభజన వల్ల వైసీపీ నాయకులే ఆందోళనలో ఉన్నారని చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్, ఎంఆర్వో, పోలీస్స్టేషన్లు కేంద్రంగా అవినీతి పెరిగిందనీ, వైసీపీ ఏజెంట్లు అక్కడ ఉంటున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పైనా, బీజేపీపైనా కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నదనీ, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని వివరించారు. ఫాసిస్ట్ పద్ధతిలో పాలన సాగించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దని సూచించారు. సీపీఐ జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్‌లో జరుగుతాయనీ, ఈ సందర్భంలో తమ జాతీయ విధానాన్ని నిర్ణయిస్తామన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలనీ, నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్వీసు కోల్పోకుండా పరస్పర బదిలీలు చేపట్టాలి : చాడ
మీడియా సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సర్వీసు కోల్పోకుండా పరస్పర బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 317 జీవోలో అనేక లొసుగులు, లోపాలున్నాయని చెప్పారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో 317 జీవోకు కొంత వెసులుబాటు కల్పిస్తూ 21 జీవో ద్వారా పరస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని అన్నారు. పాత సర్వీసును కోల్పోయి ఎవరైనా బదిలీకి వెళ్తారా?అని ప్రశ్నించారు. ఇది పొమ్మనకుండానే పొగ పెట్టినట్టు ఉందన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఉద్యోగుల బతుకులు, వారి సర్వీసును కాపాడాలని కోరారు. స్థానికతకు ఇబ్బంది లేకుండా 317 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా, చట్టపరిధిలో బదిలీలుండాలని సూచించారు. వడగండ్ల వానతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.