Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ సామాజిక కూలీలకు మరింత ఆలస్యం
- ఎఫ్టీఓలు అప్లోడ్ చేసినా చెల్లింపులకు 30 రోజులకుపైనే సమయం
- వారంలోగా క్లియరెన్స్ 16.8 శాతమే
- ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్3(3) ప్రకారం మస్టర్ రోల్ పూర్తయిన తేదీ నుంచి గరిష్టంగా 15 రోజుల లోపే కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తున్నది. ఆ తర్వాత ఆలస్యమయ్యే ప్రతిరోజుకూ వేతన బకాయిలపై 0.05 శాతం మేర పరిహారం చెల్లించడాన్ని విస్మరిస్తున్నది. కరోనా కాలంలో కూలీలకు మరింత తొందరగా వేతనాలిచ్చి ఆసరాగా నిలవాల్సిన కేంద్రం 24 రోజులు గడిచినా ఎంట్రీ చేయట్లేదు. వివిధ సామాజిక తరగతులకు చెల్లింపుల ప్రక్రియను పూర్తిచేయడంలోనూ వివక్ష పాటిస్తున్నది. ఎస్సీ సామాజిక తరగతులకు అత్యధికంగా నెల రోజుల సమయం పడుతున్నది. ఎస్టీలకు 23 రోజులు, బీసీలకు 21 రోజులు, ఇతర సామాజిక తరగతులకు 20 రోజుల వ్యవధిని తీసుకుంటున్నది. తెలంగాణలో లిబ్టెక్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఇది తేటతెల్లమైంది. రాష్ట్రంలో 138 గ్రామపంచాయతీల్లో ఉపాధి కూలీల పేమెంట్ వివరాలను విశ్లేషించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా చేసిన పనులకుగానూ డబ్బుల చెల్లింపు ప్రక్రియలో రెండు దశలుంటాయి. కూలీలు పనిచేయగానే మండల స్థాయిలో ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్(ఎఫ్టీఓ) చేశారు. ఆ ఎఫ్టీఓలు కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్ పద్ధతిలో పంపబడతాయి. దీన్ని స్టేజ్-1గా పిలుస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇలా పంపినవాటిని కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ పూర్తిచేసి వేతనాలను నేరుగా కూలీల ఖాతాల్లోకి బదిలీ చేయాలి. ఇది స్టేజ్-2. చట్టప్రకారం మొదటి దశని ఎనిమిది రోజుల్లో, రెండో దశని ఏడు రోజుల్లో పూర్తిచేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతున్నది. 24.6 శాతం లావాదేవీలు ఎఫ్టీఓ అప్లోడ్ చేసిన తేదీ నుంచి చెల్లింపులకు 30 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతున్నదని సర్వేలో తేలింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వారం వ్యవధిలో పూర్తిచేసిన లావాదేవీల శాతం కేవలం 16.8 శాతమే. 2020-21లో అదే 66 శాతం, 2019-20లో 72.2 శాతంగా ఉన్నాయి.
రెండో దశలో ఎస్సీ సామాజిక తరగతులకు మిగిలిన వారి కంటే ఎక్కువ సమయం పట్టడానికి కులాల వారీగా ఎఫ్టీఓలు జారీ చేసే పద్ధతే కారణమని సర్వేలో తేలింది. కులాల వారీగా కూలీలను విభజించే ఉత్తర్వులను మార్చి2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో అదే ఏడాది నవంబర్లో ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నది. అయితే, కూలీల చెల్లింపులో మాత్రం ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎఫ్టీఓ రెండో దశలో జరుగుతున్న జాప్యం ఉపాధి హామీ చట్టాన్ని ఉల్లఘించడమే అవుతుంది. అట్లాగే, స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలున్నాయి.
కూలీలకు ఆలస్య పరిహారం చెల్లించాలి : పి.శంకర్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కేంద్రం పూనుకున్నట్టు ఈ చర్యల ద్వారా స్పష్టంగా అర్ధమవుతున్నది. కూలీలకు ఆలస్యమైన ప్రతిరోజూ పరిహారం చెల్లించాలి. కరోనా కాలంలో ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు చెల్లించి ఆదుకోవాలనే దృక్పథాన్ని కేంద్రం విడనాడింది. పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించట్లేదు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు, మనుష్యుల కుల, మత అసమానతలను పారదోలేందుకు తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం మూలసూత్రాలకే విఘాతం కలిగిస్తున్నది. కొత్త సాఫ్ట్వేర్ వచ్చాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.