Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలా మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తా
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ హెచ్చరిక
- మోడీకి, కేసీఆర్‌కు రాజ్యాంగ స్ఫూర్తి తెలియదు
- నేడు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు
- అంబేద్కర్ విగ్రహాలకు పాలభిషేకం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సూత్రధారి...సీఎం పాత్రధారి అనిటీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. మరోసారి రాజ్యాంగంపై అనవసరంగా మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తానంటూ హెచ్చరించారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచానికి తెలిసినా ప్రధాని మోడీకి, కేసీఆర్‌కు తెలియకపాయే అని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మెన్ ప్రీతం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలో చేపట్టిన 48 గంటల దీక్ష శనివారం ముగిసింది. అంతకు ముందు దీక్షలో కూర్చొన్న నేతలకు రేవంత్‌రెడ్డి నిమ్మరసమిచ్చిన ఆందోళనలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఓటు విలువ ప్రజలందరికీ సమానంగా ఉందన్నారు. 'పదవుల్లో ఉండేవారంత సేవకులు మాత్రమే. ప్రజలకు సేవ చేసేందుకే మమ్మల్ని జీతగాళ్లుగా పెట్టుకున్నారు' అని చెప్పారు. ఈవిషయం కేసీఆర్ ఆయన మిత్రుడు మోడీకి అర్ధం కావడం లేదని విమర్శించారు. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాయశ్చితంగా ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి, ప్రజలకు క్షమాపణ చెబుతారని భావించానన్నారు. వాటిని సమర్థించుకునేందుకు ఆ పార్టీ ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వంటి నేతతో ఎదురుదాడి చేయించారని విమర్శించారు. పదవుల కోసం కేసీఆర్ కాళ్ళ దగ్గర నిలబడాల్సిన అవసరం ఉందా? అని వారిని ప్రశ్నించారు. 'కశవరావు నీ విజ్ఞానం ఏమైంది. నీ ఆలోచనలకు కరోనా వచ్చిందా? కడియం శ్రీహరి నీ ఆలోచనలకు గౌరవం ఉందా?' అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆలోచన విధానాన్ని, కేశవరావు మాటలను రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. బండి, గుండు కలిసి గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్ ముందు అంబేద్కర్ సాక్షిగా దీక్ష చేశామని గొప్పలు చెబుతున్నారనీ, కేసీఆర్ మీద వారు కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజ్యసభ, లోకసభలో బీజేపీ ఎంపీలు కేసీఆర్ వ్యాఖ్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
రాజ్యాంగం లేకపోతే తెలంగాణ రాష్ట్ర విభజన సాధ్యమయ్యేదా? కేసీఆర్ రెండు సార్లు రాష్ట్రానికి సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటల వెనుక బీజేపీ,ఆర్ఎస్ఎస్ కుట్రదాగి ఉందనీ, అందుకు నరేంద్రమోడీ సూత్రదారి...కేసీఆర్ పాత్రదారి అని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదులు చేయాలనీ, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి గీతక్క నాయకత్వంలో ట్యాంక్ బండ్ వద్ద పాలాభిషేకం చేస్తామన్నారు. సోమవారం పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి దీక్ష చేయబోతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షులు రాజీవ్ లిలోతియా, అద్దంకి దయాకర్, మానవతారారు, శివసేనారెడ్డి తదితరులు మాట్లాడారు.