Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఐ కోసం స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య దుకాణాల మూసివేత
- డిపోల నుంచి కదలని ఆర్టీసీ బస్సులు
- కేంద్రం నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీలు, సంఘాల ఆగ్రహం
- సీసీఐ సాధించే వరకు పోరు ఆగదని స్పష్టీకరణ
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ పరిశ్రమను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీసీఐ సాధన కమిటీ చేపట్టిన పట్టణ బంద్ సంపూర్ణమైంది. వాణిజ్య, వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. రోజవారీ వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. వ్యాపారులు, దుకాణదారులు, అన్నివర్గాల ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదిలాబాద్ పట్టణం నిర్మానుష్యంగా మారింది. సీపీఐ(ఎం), సీపీఐ-ఎంఎల్(న్యూడెమోక్రసీ), టీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రజా, కుల, రైతు, యువజన సంఘాలు, ఆటో యూనియన్లు తదితర సంఘాలన్నీ ఏకతాటిపై వచ్చి బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీలు, సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. పట్టణంలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ అక్కడక్కడ తెరిచిన దుకాణాలు మూసివేయించారు. సీసీఐని తెరిపించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.
తెరిపించే వరకు పోరాటం
బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాకు తలమానికంగా ఉన్న సీసీఐని తెరిపిస్తామని గత ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర సహాయ మంత్రి, స్థానిక బీజేపీ నాయకులు హామీలిచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదని, కేంద్రం ఈ అంశాన్ని పెడచెవిన పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను తెరిపించేందుకు సానుకూలంగా ఉన్నా కేంద్రం తన వైఖరి చెప్పడం లేదని విమర్శించారు. సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. పరిశ్రమను తెరిపించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామని హామీనిచ్చిన బీజేపీ గెలిచిన తర్వాత హామీని తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, స్థానిక ఎంపీ స్పందించి పరిశ్రమను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడం నగేష్, సాధన కమిటీ నాయకులు విజ్జగిరి నారాయణ, నంది రామయ్య, అరవింద్, బండిదత్తాత్రి, లంక రాఘవులు, మునిగెల నర్సింగ్, రూపేష్‌రెడ్డి, కొండ రమేష్, అలాల అజరు, మున్సిపల్ వైస్ చైర్మెన్ జహీర్‌రంజానీ, యూనిస్అక్బానీ, రోకండ్ల రమేష్,అన్నమోల్ల కిరణ్, పూసం సచిన్ పాల్గొన్నారు.