Authorization
Wed April 09, 2025 05:06:42 am
- ప్రయివేటు వాహనాలైతే ఆరేడు కిలోమీటర్ల మేర ఇబ్బందులు
- 30 మంది ప్రయాణికులుంటే ఇంటిముందుకే మేడారం బస్సు
- ట్రోల్‌ఫ్రీ నెంబర్ 040-30102829 ఇదే
- స్పెషల్‌గా 3845 బస్సుల ఏర్పాటు
- మీడియా సమావేశంలో టీఎస్ ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే వారు ప్రయివేటు వాహనాల్లో వెళ్తే ఏడెనిమిది కిలోమీటర్ల ముందే దిగి నడుచుకుంటూనో, వేరే మార్గాల ద్వారానో వెళ్లాలి. అదే ఆర్టీసీ బస్సు ఎక్కితే గద్దెలకు అతిచేరువగా(400 నుంచి 500 మీటర్లు) తీసుకెళ్తాం. 30 మంది ప్రయాణికులుంటే 040-30102829 ఫోన్ చేయండి. ఇంటి ముందుకే మేడారం బస్సు వస్తుంది. జాతరకు వెళ్లేవాళ్లు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి' అని టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం జాతరకు-ఆర్టీసీ దశాబ్దాల అనుబంధం ఉందని చెప్పారు. 1968 నుంచి మేడారం జాతరకు ప్రత్యేకంగా బస్సులను తిప్పుతున్నామని వివరించారు. 2020 జాతర సందర్భంగా 19,09,838 మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారన్నారు. మేడారం జాతరను రెవెన్యూ మార్గంగా చూడట్లేదనీ, సామాజిక సేవగా చూస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది దగ్గరుండి జాతరకు బస్సులను నడపడంపై ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మేడారంలో ప్రత్యేకంగా కంట్రోల్ కమాండింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేశామని చెప్పారు. మేడారం జాతర కోసం 12,500 మంది ఆర్టీసీ సిబ్బంది, 300 మందికిపైగా ఉన్నతాధికారులు పనిచేస్తున్నారన్నారు. ఈ ఏడాది 51 పాయింట్ల నుంచి 3845 బస్సులను తిప్పనున్నట్టు తెలిపారు. మేడారం వచ్చే భక్తుల సౌకర్యార్ధం మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాల నుంచీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మేడారం జాతరకు 523 బస్సులను తిప్పామనీ, 1250 ట్రిప్పుల ద్వారా 1,20,000 వేల మందికి సేవలు అందించామని వివరించారు. మేడారంలో గద్దెలకు అతిసమీపంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేశామనీ, అక్కడ 42 ప్రత్యేక క్యూలైన్లను పెట్టామని పేర్కొన్నారు. అక్కడే మూడు ఆంబులెన్స్‌లను, ఐసీయూ పడకలున్న వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 100 సీసీ కెమెరాలతో మేడారం బస్టాండ్‌ను ఎప్పటికప్పుడూ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. 300 మంది వాలంటీర్లతో సేవలను అందిస్తామన్నారు. ఎక్కడైనా బస్సు పాడైపోతే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే రిపేర్ చేసేలా 11 ప్రత్యేక మొబైల్ మెకానిక్ టీమ్‌లను అందుబాటులో ఉంచామన్నారు. చాలా వరకూ కండక్టర్‌లెస్ బస్సులను నడుపుతామనీ, తాడ్వాయి క్యాంపునకు వెళ్లాకే టికెట్లు ఇస్తామన్నారు. ఆ క్యాంపు నుంచి మేడారానికి ప్రత్యేకంగా 30 సెటిల్ బస్సులను తిప్పుతున్నామనీ, ప్రయాణికులు అందులో ఉచితంగా సేవలు అందిస్తామన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిలో కరోనా వ్యాక్సిన్ డబుల్ డోస్ పూర్తిచేసుకున్నవారినే విధుల్లో పెట్టామనీ, ప్రతి బస్సునూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. మేడారం జాతర కోసం కిట్స్ విద్యార్థుల సహకారంతో ఆర్టీసీ ప్రత్యేక యాప్‌ను రూపొందించిందనీ, బస్సులు, బస్టాండ్‌ను గూగుల్ మ్యాప్‌తో అనుసంధానం చేశామని చెప్పారు. ప్రజలంతా ఆర్టీసీ సేవలను విరివిగా వాడుకుంటూ ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాలనీ, తద్వారా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.