Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీకరించిన దరఖాస్తులను తక్షణం పరిశీలించాలి
- కందకాలు తవ్వడం, స్ట్రేంచర్లు కొట్టడం ఆపాలి
- పోడు రైతు పోరాట కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో వక్తలు
- గవర్నర్, మంత్రి, సీఎస్‌కు వినతులు
- 9,10 తేదీల్లో బస్సు యాత్ర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ప్రభుత్వం మాటతప్పిందని పోడు రైతు పోరాట కో ఆర్డినేషన్ కమిటీ ఆరోపించింది. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫేసర్ కోదండరామ్ అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులు సీతక్క ,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి , సీపీఐ(ఎం ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు , కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు ,మధు, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ లతో పాటు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరామ్ నాయక్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేష్ ,తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భవాని రెడ్డి, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్రావు, సీపీఐ ఎంఎల్ జనశక్తి నాయకులు బొమ్మకంటి కొమరయ్య, గుండాల మండల ఎంపీపీ సత్యం, రైతు కూలీ పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గతేడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉద్యమ ఫలితంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామంటూ సీఎం అసెంబ్లీలో వాగ్దానం చేశారని గుర్తుచేశారు. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పోడు భూముల సాగుదారుల నుంచి 12 లక్షల అటవీ ఎకరాలకు గాను 1 లక్షా 10 వేల దరఖాస్తులను స్వీకరించారని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను ఇప్పటి వరకు ఎందుకు పరిశీలించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా పోడు సాగు దారుల భూముల్లో అటవీ సరిహద్దుల పేరుతో యంత్రాలతో కందకాలు తవ్వడం, కొట్టడం చేస్తున్నదని చెప్పారు. తక్షణం ఈ పద్దతిని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా శాటిలైట్ మ్యాపుల పేరుతో ఆ భూములను అడవుల్లో కలిపేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. ఇది అన్యాయమంటూ ఎదురుతిరిగిన గిరిజనులు ,పేదలపై అటవీశాఖ ,పోలీసులు దాడులు చేస్తూ అక్రమ కేసులు మోపుతున్నారనీ, తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కో ఆర్డినేషన్ కమిటి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. పోడు భూముల సమస్యలపై తక్షణం గవర్నర్, గిరిజన శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేయడం, ఈ నెల 9,10 తేదీల్లో మేడారం నుంచి ఇల్లెందు వరకు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్పందనను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని తీర్మానించారు.