Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు, ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న పీఎం
- స్వాగతం పలకనున్న మంత్రి తలసాని
- ఉన్నతాధికారులతో సీఎస్, డీజీపీ సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహించబోయే రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలతోపాటు పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సర్ణోత్సవాల్లోనూ ఆయన పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రధానికి... శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. ఆయన పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లేటప్పుడు కూడా తలసానే వీడ్కోలు పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... ప్రధాని మధ్యాహ్నం 2.10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నేరుగా ఇక్రిశాట్‌కు వెళతారు. అక్కడి స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న అనంతరం... హెలికాఫ్టర్‌లో 4.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా ముచ్చింతల్ బయల్దేరి వెళతారు. అక్కడి సహస్రాబ్ది సమారోహ వేడుకలు, పూజలు, రామానుజాచార్య విగ్రహావిష్కరణ అనంతరం రాత్రి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయల్దేరతారు.
ప్రధాని రాకను పురస్కరించుకుని ఎనిమిది వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మోడీ రాక నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి ముచ్చింతల్‌లో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 12 వరకూ నిర్వహించే రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖలు చేసిన ఏర్పాట్లను వారిరువురూ పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా పరిశీలించారు. ముచ్చింతల్ ప్రాంతాన్నీ, అక్కడకు వచ్చే మార్గాలన్నింటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీలను పరిశీలించే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వివిధ సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానళ్లలో వచ్చే అనుకూల, ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదేశాలను జారీ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రధాని విమానం దిగనున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి ఏర్పాట్లను కూడా సీఎస్, డీజీపీ పరిశీలించారు.