Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా కల్పించాలి
- ప్రధానికి మంత్రి కేటీఆర్ డిమాండ్
- విద్యా రంగం పట్ల కేంద్రం వివక్ష
- నవోదయ, మెడికల్ కాలేజీలు, ఐఐఎంలో రాష్ట్రానికి మొండిచేయి
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ప్రధాని మోడీ రాష్ట్రాల పట్ల వివక్ష చూపకుండా సమతా స్ఫూర్తిని ప్రదర్శించాలనీ, నాలుగు జిల్లాలకు సాగు, తాగు నీరందించనున్న 'పాలమూరు- రంగారెడ్డి' ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను శుక్రవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపారన్నారు. దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి రాష్ట్రానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. నవోదయ, ఐఐఎం లాంటి ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటుకూ కేంద్రం సహకరించకపోవడం వివక్షకు పరాకాష్ట అని తెలిపారు. పక్క రాష్ట్రం కర్నాటకలో అపరభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం కరువు, వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరులో చేపడుతున్న 'పాలమూరు-రంగారెడ్డి'కి ఎందుకు జాతీయ హోదా కల్పించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి రాయిచూర్-మాచర్ల రైల్వే లైన్ మార్గానికి నిధులివ్వడంలోనూ వివక్ష చూపిందన్నారు. హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి వెంట పారిశ్రామిక కారిడార్ గుర్తిస్తే ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణను ఆర్థికంగా ఇరకాటంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ విపత్తుగా మారిన కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని 150 సార్లు సవరించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజధాని మార్చాలని చెబితే లేని వివాదం కేసీఆర్ చెబితే ఎందుకు వచ్చిందన్నారు. రాష్ట్ర హక్కులపై ఉక్కుపాదం మోపుతూ వివక్ష చూపడాన్ని భరించలేక కేసీఆర్ ఆ మాట అన్నారని సమర్థించుకున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి నిర్మించిన పాఠశాల గురించి చెబుతూ ఎంతకాలం బతికామన్నది కాదు.. ఏమి సాధించామన్నదే జీవితాశయంగా ఉండాలని తెలిపారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తిమ్మాజిపేట మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయికి మించి పాఠశాల భవనాలు నిర్మించడం అభినందనీ యమన్నారు. 'మనఊరు-మనబడి' పథకంలో భాగంగా దాతలు ముందుకొచ్చి పాఠశాలల నిర్మాణాలకు రూ.10లక్షలకు పైగా విరాళాలిస్తే వారి పేర్లను శిలా ఫలకాలలో పొందుపర్చుతామన్నారు. అంతకు ముందు విద్యార్థినులు ప్రదర్శిం చిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు బ్యాగులు అందజేసి పాఠశాల ఆవరణ ప్రాంతాలు, అందులో ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ఉదరు కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి, మర్రి జమున, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య పాల్గొన్నారు.