Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ, రోడ్లు, భవనాల శాఖలు మధ్య సమన్వయంతో రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని అటవి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఆదేశించారు. విస్తృతమైన రహదారుల నిర్మాణమే అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర పరిధిలో పూర్తి స్థాయి రోడ్ నెట్ వర్క్, కొత్త జాతీయ రహదారులు, వ్యూహాత్మక ఎలివేటెడ్ రోడ్ కారిడార్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కోరినట్టు తెలిపారు. అన్ని రకాల అనుమతుల సాధన కోసం డెడ్ లైన్లు పెట్టుకుని పనిచేయాలని కోరారు. ఆయా రోడ్ ప్రాజెక్టుల అనుమతుల విషయంలో అన్ని రకాల జాప్యాలను అధిగమించాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖలు (యూజర్ ఏజెన్సీలు) అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న నిబంధనలకనుగుణంగా అనుమతుల పత్రాలను ఆన్ లైన్ లో పొందు పర్చాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ కోరారు. అనుమతుల విషయంలో శాఖా పరంగా సహకరించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారని వెల్లడించారు. స్టేజ్ -1, స్టేజ్ -2 దశల్లో ఉన్న రోడ్ ప్రాజెక్టులు, ఎక్కడ ఏ దశల్లో పెండింగ్ లో ఉన్నాయన్న విషయంపై ప్రాజెక్టుల వారీగా సుదీర్ఘంగా చర్చించారు. రెండు శాఖల మధ్య సమన్యయంతో పనులు పూర్తి చేయటం సాధ్యమవుతుందని రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కే.ఎస్. శ్రీనివాస రాజు అన్నారు. సమీక్షాసమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. దోబ్రియల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, ఆర్.అండ్.బీ స్పెషల్ సెక్రటరీ బి. విజయేంద్ర, సలహాదారు (రిటైర్డ్ ఈఎన్సీ) గణపతి రెడ్డి, చీఫ్ ఇంజనీర్ పీ. సతీష్, డీసీఎఫ్ శ్రీనివాస రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.