Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి నెటిజన్ల ప్రశ్న
- మంత్రులు, ప్రజా ప్రతినిధుల ప్రశ్నల వర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు సమ న్యాయమేదంటూ హ్యాష్ టాగ్‌తో ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ చేశారు. ప్రధాని ఐదు గంటల పర్యటన కోసం శనివారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణకు నిధులు కేటాయింపులో వివక్ష చూపిస్తూ, జాతీయ హౌదా కల్పించడం ఎందుకు లేదని నెటిజన్లు ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆయా అంశాలు, నియోజకవర్గాల సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పించినప్పుడు, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇచ్చిన ఉత్తరాలు, వినతిపత్రాలను ఏం చేశారని అడిగారు. తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉందంటూ కనీసం తెలంగాణకు సమన్యాయం ఏదనే ప్రశ్నకైనా సమాధానం చెప్పాలని కోరారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరను ఎందుకు జాతీయ పండుగగా గుర్తించడం లేదని ప్రశ్నించారు. ఎంపీ రంజీత్ రెడ్డి, ప్రగతి చెందుతున్న తెలంగాణకు సహకరించాలని కోరారు.
ఒక యువకుల బృందం ఉద్యోగాల కల్పన, ఐటీఐఆర్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఐఎంలపై ప్రధానమంత్రి సమాధానాలివ్వాలంటూ వీడియోలో ఫ్లెక్సీని ప్రదర్శించింది. కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా దాన్ని ట్వీట్ చేయటం గమనార్హం.