Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగు దారులకు హక్కు పట్టాలు ఇస్తామని చెబుతూన ేవారికి నోటీసులివ్వడమేంటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్ వెంకట్రాములు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాగు భూములను వదిలి బయటకు రావాలని అటవీ అధికారుల ద్వారా ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటీసులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2014 వరకు సాగు భూమిలన్నింటికీ హక్కు పట్టాలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆయా భూములను ఇతరులకు బదలాయించిందనీ, చెట్లను నరికారంటూ అధికారులు అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో హక్కు పట్టా ఉన్న పొలాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవచ్చంటూ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. సాగు దారులందరికీ హక్కు పట్టాలిస్తాం..దరఖాస్తులు పెట్టుకోండని చెబుతూనే మరో వైపు ఉన్న పట్టా భూములను తప్పుడు పద్దతుల్లో లాక్కోవాలని చూడటం మానుకోవాలని హెచ్చరించారు. అటవీ హక్కుల చట్టం-2006ని అమలు చేయటానికి తగిన ప్రణాళిక రూపొందించకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నదని తెలిపారు. గ్రామ సభల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ధరఖాస్తులు స్వీకరించారో బహిర్గతం చేయాలని కోరారు. వాటిని తక్షణం పరిశీలించి అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.