Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి విద్యార్థి సంఘాల నేతల వినతి
- తనకు సమాచారం ఇవ్వకుండా అనుమతివ్వడం సరికాదన్న ఎమ్మెల్సీ
- నిర్మాణాలను ఆపకుంటే విద్యార్థులతో కలిసి పోరాడుతాం
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల మధ్యలో అక్రమ కట్టడాలను ఆపాలని విద్యార్థి సంఘాల నేతలు ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టడాన్ని ఆపాలని పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, టీఎస్‌యూ, టీజేఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యాసంస్థల పట్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు విద్యాశాఖ అనుమతి ఉండాలని, తనకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా అధికారులు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. విద్యకు సంబంధించిన స్థలంలో ఇతర భవనాలను ఎలా నిర్మాణం చేస్తారని, ఇది చట్టవిరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో విద్యాలయాలను వినాశనం చేయొద్దని అన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలను ఆపకపోతే విద్యార్థులతో కలిసి పోరాడుతానని హెచ్చరించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళికృష్ణ, టీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, వీజేఎస్ జిల్లా అధ్యక్షులు దీరావత్ వీరనాయక్ మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నామని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతుండగా.. కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్ కళాశాల, బార్సు హైస్కూల్ స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కోసం కేటాయించడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధమన్నారు. ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడం మూలంగా దుర్వాసన, శబ్ధ కాలుష్యంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. వెంటనే జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, డీఈఓ, డీఐఈఓకు మెమోరాండాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బీవీ చారి, విద్యార్థి సంఘాల నాయకులు గాదెపాక సూర్యతేజ, జయశంకర్, రమేష్ పాల్గొన్నారు.