Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించే గొంతులకు తాళం
- అక్కరకు రాని ఆర్అండ్బీ అతిథి గృహాలు
- కూల్చివేతకు రంగం సిద్ధం
- వాటి స్థానంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు ప్రణాళికలు
- కాలగర్భంలో కలిసిపోనున్న నిజాం ఆనవాళ్లు
చారిత్రక కట్టడాలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిజాం పాలనలో నిర్మించిన కట్టడాలను కలగర్భంలో కలిపేందుకు అధికారులు, పాలకులు పావులు కదుపుతున్నారు. ప్రశ్నించే గొంతుకలకు వేదికలైన ఆర్అండ్బీ అతిథి గృహాలను కూల దోసి.. ఆ గొంతుకలకు తాళం వేసే కుట్రలకు తెరలేపారు. ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు వాటి స్థానంలో మార్కెట్లు, ఇతర నిజాం కాలంలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయ భవనాలను కూల్చి వాటి స్థానంలో మల్టీ పర్పస్ ఆస్పత్రి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో జిల్లా శివారు ప్రాంతంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనాలు నిర్మించారు. ఇలా ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇలాగే ఉంటే.. భావి పౌరులు భవిష్యత్‌లో చారిత్రక కట్టడాలను మ్యూజియంలో చూడాల్సిన దుస్థితి దాపురించనుంది.
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిజాం కాలంలో నిర్మించిన ఆర్అండ్బీ అతిథి గృహం అనేక సంవత్సరాల నుంచి సేవలందిస్తూ వస్తోంది. ఈ భవనాలను నిజాంలు అతిథుల విడిది కోసం నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది వీఐపీలు అందులో బస చేశారు. కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే ఈ కార్యాలయాన్ని ఏలికలు కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు. వీటి స్థానంలో వెజ్, నాన్‌వెజ్ సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని కూల్చివేసి వాటి స్థానంలో మల్టీ పర్పస్ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం యోచనలో ఉంది. అందుకనుగుణంగా ముందస్తుగా ప్రభుత్వం జిల్లా కేంద్రం శివారులో భూత్పూరు వెళ్లే రహదారిలో నూతన కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించింది. ఇలా అన్ని జిల్లా కేంద్రాల్లో కోట్లు ఖర్చు చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర కార్యాలయాలు నిర్మించే ప్రభుత్వం చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను విస్మరించింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్డీఓ, పోలీసు స్టేషన్లు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు మొదలుకుని గ్రామ పంచాయతీ భవనాలు కూడా నిజాం నవాబులు నిర్మించినవే. వాటిలో అధికారులు సేవలందిస్తూ వచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని శిథిలావస్థకు చేరుకోగా వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించారు. అయితే, పురాతన కట్టడాలను మాత్రం కూల్చలేదు. మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో చాలా చారిత్రక కట్టడాలు, కోటలున్నాయి. అవి కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉంది.
ప్రశ్నించే గొంతుకలకు తాళం !
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు సమావేశాలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించేవారు. ఈ గృహం కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఉండటంతో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలియజేసేందుకు ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు కార్యాచరణ చేసుకునేందుకు ఇక్కడ కలిసేవారు. తర్వాత అక్కడి నుంచి కార్యక్రమంలోకి దిగేవారు. ఇది అధికార పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. ఇక ప్రశ్నించే గొంతుకలకు తాళం వేయాలని యోచించి క్రమంగా అతిథి గృహంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించలేదు. క్రమక్రమంగా ఈ గృహాన్ని కూల్చేస్తే సమస్య ఉండదని బావించి అభివృద్ధి ముసుగులో కాలగర్భంలో కలిపేందుకు సిద్ధమయ్యారు.
పురాతన కట్టడాలను కాపాడుకుందాం
జిల్లాలోని పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భావితరాలకు ఈ కట్టడ విశేషాల గురించి తెలపాలి. పురాతన భవనమైన ఆర్అండ్బీ అతిథి గృహాన్ని కూల్చి కూరగాయల మార్కెట్ నిర్మించాలనుకోవడం సరైంది కాదు. పాలకులు, అధికారులు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
కడియాల మోహన్- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు- మహబూబ్‌నగర్