Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ స్కీములకు భారీగా తగ్గిన కేటాయింపులు
- పోషకాధారిత ఎరువులు తీసుకొస్తామని నాలుగేండ్లుగా మోసం
- వరి తప్ప ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం కరువు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వరుసగా రెండేండ్లు కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజల ఆశలను చిదిమేసిన నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై అన్నదాతలు బండెడు ఆశలు పెట్టుకున్నారు.. తీరా 'మీ కష్టం మాక్కావాలి.. మీ ఇబ్బందులు మాకు అక్కర్లేదు' అన్న సందేశాన్ని అంతర్లీనంగా అందించిన కేంద్ర మంత్రి.. సాగు రంగానికి రూ.12800కోట్లు మాత్రమే విదిల్చారు. అదీ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన 33,600కోట్లతో పోల్చితే సగం కూడా లేదు. పెరుగుతున్న ఎరువుల ధరలను నియంత్రించకుండా సాగు పథకాలకి ఏటా కేటాయించే నిధుల్లో కోతలు విధించడం గమనార్హం. 'జీరో ఫార్మింగ్ బడ్జెట్' పేరుతో సేంద్రీయ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తామని చెబుతున్నా.. ఉన్న భారాలను తగ్గించే ఏ ఒక్క ముచ్చటా చెప్పకపోవడం పట్ల రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.రాష్ట్రం ఏర్పడిన ఏడాది నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతూ.. ఒక్కో సీజన్లో సుమారు 12లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతున్నాయి. అందులో వరి సాగు విస్తీర్ణమే సుమారు 10లక్షల ఎకరాల వరకు ఉంటోంది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా వరి వైపే మొగ్గుచూపారు. దీంతో వరి తరువాత పత్తి, మొక్కజొన్న, అక్కడక్కడా కంది తప్ప మిగతా పంటలేవీ పండించడం లేదు. అందుకు కారణాలు లేకపోలేదు. కేంద్రం ఆయా చిరుధాన్యాలు, ఆహార ఉత్పత్తులపై సబ్సిడీలను ఎత్తేసింది. ఐదేండ్లుగా మద్దతు ధరలనూ పెంచడం లేదు. మరోవైపు పంటల బీమాను కల్పించడం లేదు. ముఖ్యంగా సాగు ప్రోత్సాహకాలుగా ఉన్న యంత్రలక్ష్మి, డ్రిప్ ఇరిగేషన్, ఇతర సాగు యంత్రాలు కొనుగోలు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రతామ్నాయ పంటల సాగు జోలికి పోవడం లేదు. కనీసం కూరగాయల నూ సాగు చేయడంలో ఆసక్తి చూపకపోగా 90శాతం కాయగూరలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నా యి. మరోవైపు ఎరువుల ధరలను కేంద్రం నియంత్రించడం లేదు. ఏడాదిలోనే రెండుసార్లు ధరలు పెరిగాయి. ఎరువుల్లో ప్రధానంగా వాడే పొటాష్ పాత ధర (50కిలోల బస్తాకు) రూ.1040 ఉండగా ప్రస్తుతం రూ.1700కు పెరిగింది. ఇలా రెన్నెళ్ల కిందట ఏకంగా 50శాతం మేర ఉన్న ఆయా ఎరువుల ధరలు పెరగడం రైతుల నడ్డి విరిచినట్టయింది.
ప్రత్యామ్నాయానికి ప్రోత్సాహం కరువు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 6వేల ఎకరాలు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4వేల ఎకరాలు, పెద్దపల్లిలో 4500 ఎకరాలు, కరీంనగర్లో 8వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేయాల్సిన అవసరం ఉందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 40లక్షల జనాభాకు సరిపడా కూరగాయలకు కనీసం 21వేల నుంచి 23వేల ఎకరాల్లో సాగవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూరగాయలు సాగువుతుంది 3500 ఎకరాలు మాత్రమే!. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రోత్సాహకాలుగానీ, మద్దతుగానీ ఏదీ ప్రకటించలేదు.