Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రాణహిత-చేవెళ్ల'ను మార్చి వార్దా ప్రకటన
- వార్దా బ్యారేజీ నిర్మాణంపైనా సందేహాలే..
- సర్వేలతో సరి.. డీపీఆర్ కాలే..
- లైడార్ సర్వే చేపట్టి ఆరేండ్లైనా అతీగతి లేదు
నవతెలంగాణ - కాగజ్‌నగర్
ఒకటి కాదు రెండు కాదు, ఆరేండ్ల నుంచి ఒకటే మాట. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపకల్పన జరిగిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 56 వేల ఎకరాలకు మాత్రమే నీరందేది. మా ప్రభుత్వం దీన్ని రీ డిజైన్ చేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం'. ఈ మాటను టీఆర్ఎస్ ప్రభుత్వం 2016 నుంచి చెప్పుకుంటూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణంపై ఒక్క అడుగు ముందుకు పడకపోగా, దీన్ని ప్రాణహిత నదిపై నుంచి వార్దా నదిపైకి మారుస్తున్నట్టు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా ప్రాజెక్టు డీపీఆర్ దశను వీడలేదు. ఇప్పుడు మళ్లీ అధికారులు హడావుడి చేస్తుండటం చర్యనీయాంశమైంది.నెల రోజుల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం కేసీఆర్ తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ డీపీఆర్ త్వరగా తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల ఒకటో తేదీన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించి వెళ్లారు. అయినా ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఈ ప్రాంత రైతాంగం మాత్రం పూర్తి విశ్వాసంతో లేదు. దీనికి ప్రధాన కారణం.. 2016లో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించడమే కాకుండా లైడార్ సర్వే కూడా చేపట్టింది. 2016, అక్టోబర్‌లో వాప్కోస్, జీఎంఆర్ జియోనో సంస్థలు సంయుక్తంగా లైడార్ సర్వే చేపట్టాయి. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 56వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందే విధంగా డీపీఆర్ తయారు చేశారని, తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఎకరాలకు నీరందే విధంగా డీపీఆర్ తయారు చేసేందుకు లైడార్ సర్వే చేపడుతున్నట్టు నీటిపారుదల శాఖ ఈఈ రాంచంద్రం అప్పట్లో ప్రకటించారు. సర్వే తర్వాత ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునేవారే కరువయ్యారు.
2018లో మళ్లీ తెరపైకి ప్రాజెక్టు
2016లో లైడార్ సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది. ప్రాణహితపై కాకుండా ఎగువన ఉన్న వార్దా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ప్రకటించింది. కౌటాల మండలం గుండాయిపేట్ సమీపంలోని వార్దా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించింది. ప్రాణహిత ప్రాజెక్టు కంటే వార్దా ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత రైతాంగానికి లాభం జరుగుతుందని ఇంజినీరింగ్ అధికారులు అప్పట్లో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. 2018, డిసెంబర్లో ఎన్నికలు ముగిశాక మళ్లీ షరా మామూలే.
నాలుగేండ్ల తర్వాత..
ఈ నాలుగేండ్లలో ఒక్కసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేయలేదు. నెల రోజులుగా ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రతి 12 ఏండ్లకోసారి జరిగే ప్రాణహిత పుష్కరాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉండటమే ఇందుకు కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రాణహిత ప్రాజెక్టును ఇక్కడి నుంచి తరలించడంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్ర అసందృప్తితో ఉంది. మరో వైపు ప్రతిపక్షాలు పుష్కరాల సమయంలోనే ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీన్ని నుంచి బయటపడేందుకే రాష్ట్ర ప్రభుత్వం వార్దా బ్యారేజీ నిర్మాణం పేరిట మరో కొత్త నాటకానికి తెర తీస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
'ప్రాణహిత'ను పక్కన పెట్టడంలో ఆంతర్యం ఏమిటో?
మహారాష్ట్ర నుంచి ప్రవహించే వార్దా నది, వైన్‌గంగల కలయికే ప్రాణహిత. ఇది కౌటాల మండలం తుమ్డిహేటి వద్ద ప్రాణహితగా ఆవిర్భవిస్తుంది. తుమ్డిహేటి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం (2008, డిసెంబర్ 16) శంకుస్థాపన చేసింది. ఇపుడు టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ప్రాణహితకు ఎగువన ఉన్న వార్దా నదిపైకి తరలించింది. వార్దానది, వైన్‌గంగ కలిసి ప్రవహించే ప్రాణహితలో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నీటి కరువు అధికంగా ఉన్న సమయంలోనే ప్రాణహితలో నీటి సామర్థ్యం 1500 టీఎంసీలకు పైగా ఉంటుంది. ఇతర సమయాల్లో ప్రాణహితలో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీటి ప్రవాహం ఉంటుంది. ఇప్పటికే ప్రాణహిత ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేపట్టి సుమారు రూ. 2వేల కోట్ల వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాణహితపై 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఉంది. ఎలాంటి ఎత్తిపోతలూ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా సుందిళ్ల వరకు సాగునీరందించే అవకాశం ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం వార్దా బ్యారేజీ నిర్మాణం ద్వారా సిర్పూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఒక్క మండలం, బెల్లంపల్లి నియోజకవర్గలోని ఐదు మండలాలకు సాగు నీరందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అతి తక్కువ నీటి ప్రవాహం ఉన్న వార్దా నదిపై నిర్మించే బ్యారేజీ ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందుతుందనే సందేహాలు నెలకొన్నాయి.