Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబానీ, ఆదానీల పక్షం.....
- సబ్ కా సాత్... సబ్ కా వికాస్ ఒట్టి బోగస్
- ఏఐటీయూసీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ బినోరు విశ్వం
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ శ్రామికవర్గం, ప్రజలవైపు లేడనీ, ఆయన ఆదానీ, అంబానీలవైపే ఉన్నాడని రాజ్యసభలో సీపీఐ పక్ష నేత బినోరు విశ్వం ఆరోపించారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మోడీ మోకరిల్లుతున్నారని విమర్శించారు. సబ్కా సాత్ సబ్ కా వికాస్ అనేది ఒట్టి బోగస్ చెప్పారు. పార్లమెంటులో నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల దేశ ప్రజలు, కార్మికవర్గం సంతృప్తిగా లేరని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో (గురుదాస్ దాస్గుప్తానగర్ (టి.నరసింహన్ హాల్)లో మూడు రోజుల పాటు జరగనున్నాయి. శనివారం సమావేశాలను ప్రారంభించిన బినోరు విశ్వం ప్రసంగించారు. దళితులు, మహిళలు, యువకులు, సామాన్యులు, కార్మికులు, రైతులు మోడీ పాలనలో సంతృప్తిగా లేరని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన మోడీ ఆదానీ, అంబానీల పక్షాన నిలబడి వారికి మేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం మద్దతు ధర చట్టం చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నా చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని చూసి చట్టం తెస్తారా? అని ప్రశ్నించారు. కనీసం మద్దతు ధర చట్టం సాధించే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. రైతులు సాగించిన మహత్తర పోరాటం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చట్టాలను వెనక్కి తీసుకున్నదని అన్నారు. అనేక పోరాటాలు సాగించిన ఏఐటీయూసీ ఎన్నో విజయాలను సాధించిందని మోడీ ప్రభుత్వంపై అదే తరహాలో పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో మౌలిక సదుపాయాలైన రోడ్లు, రహదారులు, ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేలను అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నదని అన్నారు. జాతి సంపదను కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదని చెప్పారు. ప్రజలను కాపాడండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో మార్చిలో సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని రకాల ధరలు పెరిగిపోయాయనీ, 95 శాతం మంది ప్రజలు మోడీ ప్రభుత్వంపై ఆగ్రహాంతో ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఫాసిజం, నాసిజం తరహాలో పాలన సాగుతున్నదని ఆరోపించారు. జాతీయ ఉపాధి పథకం అమలుకు గతంలో 98 వేల కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో 70 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. 100 రోజులు ఉపాధి కల్పించాల్సిందిపోయి కేవలం 50 రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పేర్కొన్నారు. గతంలో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారనీ, ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఊసే లేదని గుర్తుచేశారు. సాధారణ బడ్జెట్లో 400 కొత్త రైళ్ళు నడిపిస్తామని మాత్రమే పేర్కొన్నారని గుర్తుచేశారు. ఆజాదీ కా అమృత మహౌత్సవ్ మోడీకి మాత్రమేననీ, అది ప్రజలకు మాత్రం విషమని అన్నారు. 2024లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా కార్మికవర్గం ప్రతిఘటన పోరాటాలకు సిద్దం కావాలని కోరారు.
అనంతరం ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి మోహనశర్మ ఇటీవల కాలంలో అమరులైన కార్మిక నేతలకు సంతాప సూచకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి అంజలి ఘటించారు. తొలుత అమర్జిత్కౌర్ ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమర్జిత్కౌర్, బీ.వీ.విజయలక్ష్మి, బినోరు విశ్వం, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యం.డి.యూసుఫ్, అధ్యక్షులు బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి వీ.ఎస్.బోస్, కోశాధికారి పి.ప్రేంపావని, కార్యదర్శులు యం.నర్సింహ్మా, బి.వెంకటేశం, బి.చంద్రయ్య, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, జాతీయ కార్యవర్గ సభ్యులు వి.రత్నాకర్‌రావు తదితరులు నివాళులర్పించారు. పల్లె నర్సింహ బృందం ఆలపించిన విప్లవ గేయాలు ఆలోచింపచేశాయి.