Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనులు, పేదల ఇండ్లు కూల్చేసిన తహసీల్దార్
- కూలి పనులు చేసి కట్టుకుని రోడ్డున పడ్డాం : బాధితులు
- సీపీఐ(ఎం), గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాల్లో.. పేదలు రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న గూడును అధికారులు శనివారం కూల్చేశారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారు.. దీన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం), గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సిఎస్సి బస్తీ గ్రామ పంచాయతీ సున్నం రాజయ్యనగర్, రాజీవ్‌నగర్ తండాలో 13 సంవత్సరాల కిందట ఇందిరమ్మ ఫేజ్ -2లో 70 మంది గిరిజనులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చింది. రెక్కల కష్టంతో వాళ్లు రేకుల షెడ్లు, పాకలు కట్టుకుని నివాసం ఉంటున్నారు. అకస్మాత్తుగా శనివారం ఉదయం ఏడు గంటలకే తహసీల్దార్ కృష్ణవేణి ఆధ్వర్యంలో
పోలీసులు, సిబ్బంది ట్రాక్టర్, డోజర్‌తో వెళ్లారు. బాధితులను బయటకు రప్పించి ఇండ్లను నేలమట్టం చేశారు. కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అన్నం గిన్నెలు, బియ్యం, బట్టలు, నీళ్లు నేలపాలయ్యాయని సూరబాక లకిë, ధనసరి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే సీపీఐ(ఎం), గిరిజన సంఘాల నేతలు సంఘటన స్థలానికి వచ్చి కూల్చివేతలను పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్లను దౌర్జన్యంగా కూల్చేయదాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ - ఇల్లందు రోడ్డుపై బైటాయించారు. రెండు గంటలపాటు సీపీఐ(ఎం), తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్) ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఇండ్లు కూల్చివేతపై తహసీల్దార్ సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. పోలీసుల ఒత్తిడి, జోక్యంతో రాస్తారోకో విరమించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. బాధితుల లిస్ట్ ఇస్తే డబుల్ బెడ్ రూంలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), కేవీపీఎస్, వ్యసాయ కార్మిక, టీఏజీఎస్ సంఘాల నేతలు దేవులపల్లి యాకయ్య, తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, మన్నెం మోహన్ రావు, రాందాస్, సానప రమేష్, సుర్నపాక లక్ష్మి పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు
అవి ప్రభుత్వ భూములు. అక్కడ ఇండ్లు నిర్మించుకోవద్దని చెప్పాం. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఏమీ లేవు. మండలంలో అనుమతులు లేని ఫంక్షన్‌హాల్స్, పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నట్టు దృష్టికి రాలేదు.
- తహసీల్దార్ కృష్ణవేణి
ఎమ్మెల్యేప్రోద్బలంతోనే కూల్చివేతలు
ఎమ్మెల్యే హరిప్రియ ప్రోద్బలంతోనే గిరిజనుల ఇండ్లు కూల్చేశారు. పేదలు, గిరిజనులు ఇండ్లు నిర్మిచుకొని ఉంటున్నారు. కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చేశారు. ఇందిరమ్మ పట్టాల ఆధారంగానే గిరిజనులు ఇండ్లు నిర్మించుకున్నారు. ఏజెన్సీ చట్టాలు ఉన్నా గిరిజనులకు న్యాయం జరగట్లేదు.
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్
కూలి పనులు చేసుకుని కట్టుకున్నాం
నాకు ఇల్లు లేకుండే.. ఇందిరమ్మ ఇంటి జాగ ఇస్తే.. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని సాగదీస్తున్నా. పైసాపైసా కూడబెట్టుకుని మట్టి పోయించి సిమెంటు స్థంభాలతో రేకులు వేయించాను. ఇప్పుడు ఉన్నదంతా పోయింది. ఎక్కడ ఉండాలి. సీఎం కేసీఆర్ పేదలకు చేసే న్యాయం ఇదేనా..? ఇండ్లు కూల్చొద్దని తహసీల్దార్ కాళ్లు మొక్కినా కనికరించలేదని ఊకె సమ్మక్క, ఈసం లక్ష్మి అన్నారు. పిల్లలు, ముసలివాళ్లతో బయట ఉన్నాం. మాకు దిక్కెవరు అంటూ రోధించారు.
- గొగ్గెల వీరమ్మ