Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం
- సర్వత్రా చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ శనివారం నాటి రాష్ట్ర పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. అందువల్లే సీఎం... ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్లకుండా దూరంగా ఉన్నారు...' అంటూ అధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే సీఎం... ప్రధాని పర్యటనలో పాల్గొనకుండా దూరంగా ఉండటానికి జ్వరం కాకుండా... రాజకీయ కారణాలున్నాయని వినికిడి. గత కొద్ది రోజుల నుంచి ఆయన బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న చర్యలను నిశితంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ సందర్భంగా కూడా కేసీఆర్... మోడీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి రావాలంటూ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతానని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారని సమాచారం. మరోవైపు బీజేపీ పట్ల బెంగాల్లో మమతా బెనర్జీ అనుసరించిన వ్యూహాన్నే (ప్రధాని పర్యటనలకు దూరంగా ఉండటం) ఇక్కడ కేసీఆర్ అనుసరిస్తున్నారనే వాదన కూడా వినబడుతున్నది. ఇదే సమయంలో కొద్ది నెలల క్రితం ఢిల్లీకి వెళ్లిన సీఎంకు... ప్రధాని అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు మోడీని... కేసీఆర్ కలవకపోవటానికి ఇది కూడా ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.