Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన బోధనలు అనుసరణీయం
- సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ
- 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం జాతికి అంకితం
- అసమానతలపై పోరాడిన అంబేద్కర్ ఆధునిక నాయకుడు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సామాజిక సమతా మూర్తి రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి ప్రేరణగా నిలిచాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన సమతా సూత్రం భారతదేశ రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 216 అడుగుల ఎత్తయిన రామానుజుడి (సమతా మూర్తి) విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి... జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముచ్చింతల్లోని 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందని తెలిపారు. గురువులతోనే జ్ఞానం వికసిస్తుందనీ, రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీకగా నిలిచిందని అభివర్ణించారు. జగద్గురు రామానుజుడు 11వ శతాబ్దంలోనే మానవ కల్యాణం గురించి ఆలోచించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన తన బోధనల ద్వారా ప్రజల్లో ఉన్న అంధ విశ్వాసాలను పారద్రోలారని వివరించారు. రామానుజుడి విశిష్టా అద్వైతం మనకు ప్రేరణగా నిలిచిందన్నారు. భక్తికి కులం, జాతి లేదంటూ దళితులను సైతం ఆలయ ప్రవేశం చేయించారని తెలిపారు. మనిషికి జాతి కాదు.. గుణమే ముఖ్యమంటూ ఆయన లోకానికి చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త అని స్మరించుకున్నారు. రామానుజుడు చూపిన బాటలో, అసమానతల నిర్మూలన కోసం ఆధునిక నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి చేశారని వ్యాఖ్యానించారు. భారత దేశంలో ద్వైతం, అద్వైతం రెండూ కలిసి ఉన్నాయని వివరించారు. రామానుజాచార్యుల బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని చెప్పారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించడంలో సర్దార్ వల్లభారు పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఐక్యత, సమానత్వం కీలక పాత్ర పోషించాయనీ, ప్రజలందరిలో జాతీయత జ్వాలను రగిల్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలనీ, పర్యాటకానికి తలమానికంగా సమతా కేంద్రం వెలుగొందాలని ప్రధాని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా ఆయనతో సమతాస్థలిలో చినజీయర్ స్వామి యజ్ఞం చేయించారు. ఈనెల 13న రామానుజ అంతర్ నిర్మాణాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించ నున్నారు. ప్రధాని వెంట చినజీయర్ స్వామి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో పర్యటనకు విచ్చేసిన ప్రధానికి... రాష్ట్ర ప్రభుత్వం తరపున శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, తిరిగి మోడీ ఢిల్లీకి వెళ్లేటప్పుడు కూడా వీడ్కోలు పలికారు.