Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఫలితాలతో రైతులకు ప్రయోజనం
- డిజిటల్ వ్యవసాయానికి ప్రాధాన్యం
- తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం
- కరువు పరిస్థితులపై పరిశోధనలు చేయాలి
- ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోడీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేలా శాస్త్రీయమైన పరిశోధనలు పెరగాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. వాటి ఫలితాలతో రైతులకు ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు. వాతావరణ మార్పులను అధిగమించి, తక్కువ వ్యయంతో రైతులు సాగు చేసేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని తెలిపారు. ఇక్రిశాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద సెమి-ఆరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆ దిశగా దృష్టి సారించాలని కోరారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని పఠాన్‌చెరులో గల ఇక్రిశాట్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవాలను ప్రధాని ప్రారంభించారు. అంతకు ముందు ఇక్రిసాట్‌లో వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు. వ్యవసాయ పరిశోధనలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 50 ఏండ్లుగా ఇక్రిశాట్ చేస్తున్న వ్యవసాయ పరిశోధనలు దేశానికి, ప్రపంచానికి ఎంతో మేలు చేశాయని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. రాబోయే 25 ఏండ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. రైతులకు లాభం చేకూర్చేలా.. వాతావరణ మార్పులకు తట్టుకుని నిలబడే సరికొత్త వంగడాలను సృష్టించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదపడాలని కోరారు. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయనీ, చిన్న, సన్నకారు రైతులు సైతం నిలదొక్కుకునేలా వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని 170 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయనీ, ఆయా ప్రాంతాల్లో సాగు పద్దతులపై మరింతగా పరిశోధనలు జరగాలని ప్రధాని మోడీ సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టామనీ, డిజిటల్ అగ్రికల్చర్ పద్దతులు పెనుమార్పులకు శ్రీకారం చుడుతున్నాయని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక అభివృద్ధి మరింతగా జరగాలని కోరారు. సేంద్రీయ సాగు విధానాలకు రైతులు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనూ పంట దిగుబడులు పెరిగేలా చూడాలని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేసుకోవాలనీ, బయో ఫ్యూయల్ వినియోగంతో రైతుకు సాగు ఖర్చులు తగ్గుతాయని ప్రధాని వివరించారు. దేశంలో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించబోతున్నామన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగును మరింత ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆహార భద్రత సాధించామనీ, పోషకాహానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డిజిటల్ వ్యవసాయాన్ని విస్తరించేందుకు ప్రయివేటు సంస్థల సహకారం తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రజల జీవన విధానం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జి కిషన్‌రెడ్డి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా.జాక్వెల్లిన్ హ్యూస్, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.