Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలను భయపెట్టి భూములను గుంజుకునే యత్నం
- ప్రాణం పోయినా భూమి ఇవ్వబోమంటున్న రైతులు
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనకు కార్యాచరణ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పేద రైతులకు భూమే ఆత్మగౌరవం.. దాంతో సమాజంలో గుర్తింపు దక్కుతుందని పదే పదే చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ పేద రైతుల సేద్యపు భూములను లాక్కునేందుకు సిద్ధమయ్యారు. వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు గోడు చెప్పుకుందామని రైతులు వెళితే ''ఆ భూముల వల్ల మీకేమి ఉపయోగం ఉంది..' అని హేళనగా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆ కుటుంబాలు మొత్తం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
నాలుగు తరాలుగా సేద్యం
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో సుమారు 80ఏండ్ల కిందట నుంచి సర్వే నెంబర్ 72లోని 108.21ఎకరాల భూమి 67 మంది రైతుల పేరుతో పట్టా ఉంది. అప్పుడు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమి ఇది. సుమారు నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్నారు. రాళ్లకుప్పలుగా ఉన్న భూమిని అప్పట్లోనే వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగుకు అనుకూలం చేసుకున్నారు. బోర్లు వేసి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. 67మంది రైతుల పేరుతో పట్టాలున్నప్పటికీ.. నేడు సుమారు 250 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కొంత భూమిలో పంటలు సాగు చేసుకుంటూ, మరి కొంత భూమిలో యాదవులకు ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు మేత కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం పంటరుణాలు ఇవ్వడం మొదలు పెట్టిన నాటి నుంచి నేటి వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. రైతుబంధు కూడా వస్తోంది.
ఇండిస్టీయల్ పార్కు పేరుతో గుంజుకునేందుకు కుట్ర
సారవంతమైన ఆ భూములపై ప్రభుత్వ పెద్దల దృష్టి పడింది. ఇండిస్టీయల్ పార్కు ఏర్పాటు పేరుతో ఆ భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 14న పత్రికలో.. ఇండిస్టీయల్ పార్కును 72 సర్వే నెంబర్లోని 108.21 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్నట్టు, ఏ రైతుకు ఎంత భూమి పట్టా ఉందో వివరాలను తెలియజేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ వచ్చే వరకు రైతులకు ఎలాంటి సమాచారమూ లేదు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే సర్వే మొదలు పెట్టడానికి వచ్చిన ఎమ్మార్వో, ఎంపీడీవో, ఇతర అధికారులను రైతులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేను కలిసిన రైతులు
తమ భూములు లాక్కోవద్దని జనవరి 20న స్థానిక ఎమ్మెల్యేను రైతులు కలిసి విన్నవించారు. అక్కడ ఎమ్మెల్యేకు తమ బాధలు చెపుకుంటుండగానే భూమిలో అధికారులు సర్వే చేయడం మొదలుపెట్టారు. ''ఎట్టి పరిస్థితుల్లో మీ భూములను ఎవరూ కాపాడలేరు. అడ్టుకుంటే పోలీసులను తీసుకొచ్చి అందరినీ లోపల వేసి సర్వే చేస్తాం'' అని రైతులను అధికారులు బెదిరించినట్టు సమాచారం. తమ భూములు కాపాడాలని బాలచారి అనే రైతు అక్కడే ఎమ్మెల్యే కాళ్లపై పడి బోరున విలిపించినట్టు తెలిసింది. ఒకవేళ భూములు పోయినా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రజాప్రతినిధి పేర్కొనడంతో... ఇదంతా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కలిసి ఆడుతున్న నాటకమని రైతులకు అర్థమైంది.
పాసు పుస్తకాలివ్వాలని బెదిరింపులు
ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సంగతి దేవుడెరుగు.. భూముల కోసం కనీసం రైతులతో సంప్రదించనూ లేదు. బెదిరింపులో పట్టాపాసు పుస్తకాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. రెవెన్యూ అధికారులు తమ సిబ్బందిని రైతుల ఇండ్లల్లోకి పంపించి వెంటనే భూమి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని, లేకపోతే ఒక్క రూపాయి కూడా రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మీకు ఎప్పుడో ఉచితంగా వచ్చిన భూమి.. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా వింటే మంచిది.. లేకపోతే మీకే నష్టమనే పద్ధతిలో మాట్లాడుతున్నారని తెలిసింది.
పోరాటానికి సిద్ధమవుతున్న రైతులు
నాలుగు తరాలుగా సేద్యం చేసుకుంటున్న భూమిని గద్దల్లా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే ప్రభుత్వ పెద్దలు లాక్కుంటే ఊరుకునేది లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం పోయినా సరే .. భూమిలిచ్చే ప్రసక్తే లేదని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒక కమిటీగా ఏర్పడి పోరాటం మొదలుపెట్టారు. తహాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేశారు. శనివారం ఆర్డీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈనెల 9న కుటుంబాలతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నారు.
మా భూములు వదిలిపెట్టం
మా తాత నుంచి సాగు చేస్తున్నం.. కేసీఆర్ ఇచ్చిన గొర్రెలను కూడా ఇక్కడే మోపుతున్నం. మరెక్కడా భూమి లేదు.. భూమి తీసుకుంటే మేమేం తినాలే.. గొర్రెలేం తింటయి.. ఎవరొచ్చినా అడ్డుకుని తీరుతాం. ప్రాణం పోయినా భూమి వదలం.
రైతు గోపాల్ యాదవ్- తుర్కపల్లి
ప్రభుత్వ భూములు వేల ఎకరాలున్నాయి
ఆలేరు నియోజకవర్గంలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి.. వాటిని పెద్దోళ్లు కబ్జా చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు.. అందులో ఇండిస్టీయల్ పార్కు ఏర్పాటు చేయొచ్చు కదా.. మా భూములపై ఎందుకు కన్ను వేశారు. కావాలనే కుట్రతోనే మా భూములపై పడుతున్నరు.
- రైతు షరీఫ్
భూములు గుంజుకునే ఆలోచనను విరమించుకోవాలి
పేదల భూములను గుంజుకునే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలి. వ్యవసాయ భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడి సమస్యలొస్తాయి. ఈ రైతులకు వ్యవసాయం తప్ప మరొక్కటి లేదు. జీవనాధారం ఇదే. ప్రభుత్వం ఈ భూముల జోలికి వస్తే మల్లన్న సాగర్ తరహా ఉద్యమాన్ని నిర్మిస్తాం.
కల్లూరి మల్లేశం- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు- యాదాద్రి జిల్లా