Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- ఘనంగా ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలు
నవతెలంగాణ-బోనకల్
తాను చాయ్ అమ్మి దేశానికి ప్రధాని అయ్యానని పదే పదే చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు సామాన్య ప్రజలు చాయ్ కూడా తాగకుండా చేస్తున్నాడని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను ఆదివారం శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం గ్రామ అధ్యక్షులు ధారగాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు. ధర్మభిక్షం భారత స్వాతంత్య్ర పోరాటంతో పాటు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ ప్రముఖ పాత్ర నిర్వహించారని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువుగా ఉన్న నల్లగొండ జిల్లా నాటి ఉద్యమకారుల పుట్టినిల్లుగా విరాజిల్లిందన్నారు. సమాజ మార్పు కోసం సాగే పోరాటాల్లో, సంస్కరణ ఉద్యమాల్లో తనదైన శైలిలో జనంలో ఉంటూ జనం కోసం ఉద్యమించిన గొప్ప విప్లవ వీరుడు, ప్రజా ఉద్యమ కారుడు ధర్మభిక్షం అని కొనియాడారు. రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు మాట్లాడుతూ.. ధర్మభిక్షం రాజకీయ నైతిక విలువలకు ఆదర్శమూర్తి అన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ధర్మభిక్షం నిర్వహించిన హాస్టల్లోనే ఉంటూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారని గుర్తుచేశారు.
అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ధర్మబిక్షం సహచరులైన తోడేటి కొమరయ్య, వంగాల వెంకటేశ్వర్లును నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. తొలుత తెలంగాణ గీత పనివాళ్ళ సంఘం జెండాను వంగాల వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సభలో తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర కోశాధికారి ధర్మభిక్షం తనయుడు బొమ్మగాని నాగభూషణం, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దూసరి శ్రీరాములు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, తూము రోషన్ కుమార్, మండల కార్యదర్శి యంగల ఆనందరావు, సీనియర్ నాయకులు నాగభూషణం, మాజీ ఎంపీపీ చిట్టిమోదు నాగేశ్వరరావు, బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు, సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.