Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలిన నిల్వ పత్తి..రూ.3 కోట్ల నష్టం
నవతెలంగాణ - పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలోని ఓ జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పెద్దపల్లి మండలం రాఘవపూర్ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యానులో అమ్మకానికి వచ్చిన పత్తిని అన్లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు మిల్లులో పనిచేసే సిబ్బంది తెలిపారు. వ్యాన్ను ముందుకు తీసే క్రమంలో వ్యాన్ పొగ గొట్టం నుంచి అగ్గి మిరుగులు వచ్చి అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని 3 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మిల్లులో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే పత్తి నిల్వ ఉన్నట్టు అగ్నిమాపక సిబ్బంది అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగినట్టు మిల్లు నిర్వాహకులు తెలిపారు. పెద్దపల్లి ఫైర్ అధికారి దేవనంది శ్రీనివాస్ సెలవులో ఉన్నా ఎప్పటికప్పుడు గోదావరిఖని, పెద్దపల్లి, మంథని ఫైర్ సిబ్బందిని సమన్వయం చేస్తూ సకాలంలో మంటలను ఆర్పేందుకు సహకరించారు.