Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరి అరెస్టు-ఐదుగురు పరారీలో..
- వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
వంద కిలోల గంజాయితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావిగూడెంలో జాతీయరహదారిపై చోటుచేసుకుంది. గంజాయి పట్టివేతకు సంబంధించిన వివరాలను డీసీపీ కె.నారాయణరెడ్డి చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గూడెంలో వాహనాల తనిఖీ చేశారు. లంబసింగి నుండి గంజాయిని ముఠా ముందు ఇన్నోవా కారును పైలెట్‌గా పెట్టుకుంది. తనిఖీలో షిప్టుడిజైర్ కారులో అనుమానాస్పదంగా వ్యక్తులు ఉండటాన్ని గమనించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో సుమారు రూ.42 లక్షల విలువైన గంజాయి, 10 లీటర్ల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేరళలోని కాసరాఘడ్ జిల్లా కుంజాతుర్కి చెందిన పైజల్.. రాష్ట్రంలోని లంబసింగి నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్, బెంగుళూరు మీదుగా కేరళకు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. కేరళకు చెందిన మహ్మద్ అన్సార్(19), హస్సేనర్(42)ను పోలీసులు అరెస్టు చేశారు. పైలెట్ వాహనంలో ఉన్న ఫైజల్, కబీర్, షేక్‌అబ్దుల్లా, బెంగళూరుకు చెందిన మూర్తి, నౌషాద్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. షిప్టుకారుతో పాటు మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న రామన్నపేట సీఐ మోతీరాం, చౌటుప్పల్ ఎస్సై అనిల్, పోలీస్‌సిబ్బందిని డీసీపీ అభినందించడంతో పాటు రివార్డులు అందజేశారు. సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ ఉదరురెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ ఏరుకొండ వెంకటయ్య, రామన్నపేట సీఐ మోతీరాం, చౌటుప్పల్ సీఐ దైదా అనిల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.