Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ బహిరంగసభలో అమర్ జిత్ కౌర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ చెప్పారు. ప్రణాళికా సంఘాన్నిపాతిపెట్టి నిటిఅయోగ్ ఏర్పాటు చేసి అందులో కార్పొరేట్ శక్తులను సభ్యులుగా నియమించారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) మూడు రోజుల జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని మహారాజా క్లాసిక్ ఇన్ హౌటల్ నుంచి ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ అసమానతలు తొలగిస్తామని చెబుతున్న ప్రధాని మోడీ ధనికులకు, పేదలకు మధ్య అసమానతలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో కార్పొరేట్ శక్తుల సంపద 140 మిలియన్ డాలర్లు పెరిగిందని గుర్తుచేశారు. జాతి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే కార్మికవర్గం, ప్రజలు విముక్తి అవుతారని చెప్పారు. రైతులు పేదల భూములను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగిస్తున్నదని ఆరోపించారు.కేంద్రాన్ని ప్రశ్నించిన వారిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్లను (ఈడీ) పావులుగా వాడుకుంటుందని అన్నారు. మోడీ అమలు చేస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశం వెనక్కి వెళ్ళిపోతున్నదని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఆ విషయం కార్మికవర్గం మర్చిపోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ సంపన్నవర్గాలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. దేశంలో 40 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నప్పటికీ వారిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. ఇటీవల ఫార్మా కంపెనీల ఆదాయం రూ.500 కోట్లకు చేరుకుందంటే, వైద్య వ్యాపారం ఏ విధంగా ఉందో అర్ధమవుతుందన్నారు. ప్రజలు, కార్మికులు, మహిళలు, రైతులు, కూలీలు, కర్షకులకు, యువకులు, సమాజంలోని సకల వర్గాలు సంఘటితమై మోడీని గద్దెదించేందుకు పోరు సాగించాలని పిలుపునిచ్చారు. రాజ్యసభలో సిపిఐ పక్ష నేత బినొరు విశ్వం మాట్లాడుతూ భూమి నుంచి ఆకాశం వరకు అన్ని రంగాలను ప్రయివేటు, కార్పొరేట్ పెట్టుబడిదారులకు మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. ఫాసిస్టు భావజాలం కలిగిన ఆర్ఎస్ఎస్ బాటలోనే బీజేపీ పయనిస్తున్నదనీ, ఫాసిస్టు పాలనకు ముగింపు పలికాలని విజ్ఞప్తి చేశారు. పాసిస్టు పాలన సాగిస్తున్న నరేంద్రమోడీ ప్రశ్నిస్తున్న వారిని దేశ ద్రోహులగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. వచ్చే మార్చి 29,30 తేదీల్లో జరుగుతున్న సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సభకు ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాల్ రాజ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, కార్యనిర్వాహక అధ్యక్షులు యం.డి.యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మొట్టె నర్సింహ్మా, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బీ.వీ.విజయలక్ష్మి, మోహన్, జి.ఓబులేసు, రాజేంద్రన్, విద్యాసాగర్, పి.ఎమ్.మూర్తి, ప్రేంపావని హాజరయ్యారు.