Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఉపాధి హామీ'ని నిర్వీర్యం చేస్తే..ఉద్యమం తప్పదు
- బడ్జెట్ కేటాయిపుల్లో ఉపాధిపై బీజేపీ సర్కార్ శీతకన్ను: రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదనీ, అదే జరిగితే..దేశంలోనూ రాష్ట్రంలోను పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని పలువురు ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు తీర్మాణ పత్రాన్ని ప్రవేశ పెట్టారు. ఉపాధి హామీ పనులకు కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.పట్టణ ప్రాంతాల్లో పేదలకు పని కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మర్ అలవెన్సును రద్దు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ను ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. పని దినాలు 200రోజులకు పెంచాలనీ, రోజు వేతనం రూ.600లకు పెంచాలనీ, ఆహార సబ్సడీని పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 2022-23 కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఉపాధిహామీ పథకానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పేదలకు చేరాల్సిన అవసరాలన్నీ తగ్గించి, కార్పొరేట్లకు లాభాలు చేకూరేలా రూపకల్పన చేశారని వివరించారు. ఒక పక్క ప్రజల్లో కొనుగోలు శక్తి తరిగిపోతున్నదనీ, .నిరుద్యోగం పెరుగిపోతున్నదనీ, ఉపాధి కోసం వలసలు పెరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతుంటే..బాధ్యత గల ప్రభుత్వం వీటి పరిష్కారం కోసం కేటాయింపులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఉపాధి హామీ పథకమే పేదలకు కడుపు నింపుతున్నదని తెలిపారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా..పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. దేశంలో ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదని విమర్శించారు. గ్రామాలకు వలస పెరుగుతున్న కూలీలందరికీ పనులు కల్పించాలంటే ప్రస్తుత కనీసం రూ. 2.64 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ గతేడాది కేటాయించిన రూ. 98వేల కోట్లలోనే కోత విధించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గించటమే కాకుండా, విద్య, వైద్యం, దళిత,గిరిజన, మహిళా సంక్షేమం, అభివృద్ధిపట్ల బడ్జెట్ చిన్న చూపు చూపిందని వివరించారు.రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలు వల్ల గ్రామీణ పేదల్లో ఆత్మగౌరవం పెరిగిందని చెప్పారు. ఇచ్చినకాడికి తీసుకునే స్థితి నుంచి వారిలో పనికి తగ్గ ఫలితాన్ని అడిగే శక్తి పెరిగిందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 25న దేశ వ్యాప్త ఆందోళన ఉందని తెలిపారు.బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, సీఐటీయు కోశాధికారి వంగూరి రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ట్రాన్స్‌పోర్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్,హమాలీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం శోభన్ తదితరులు మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు బడ్జెట్లో కోత విధించడాన్ని నిరసించారు.ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పేదల్ని కూటికి దూరం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అవసరాలను సక్రమంగా సమకూర్చాలని కోరారు. చివరగా వ్యవసాయ కార్మిక సంఘం మహిళా విభాగం కన్వీనర్ బి. పద్మ మాట్లాడుతూ రాబోయే కాలంలో జరిగే పోరాటాల్లో అన్ని ప్రజాసంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.