Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగునీటి ప్రాజెక్టులకు ఇరకాటం...?
- కేంద్ర వైఖరితో ఇబ్బందుల్లో రాష్ట్రం... పెరుగుతున్న వడ్డీల భారం
- సమాలోచనలో సర్కారు
- బి.బసవపున్నయ్య
రాష్ట్రానికి మళ్లీ అప్పుల తిప్పలు తప్పేలా లేవు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోగా, సాధారణంగా వచ్చే వాటిని దాదాపు సగానికి తగ్గించారు. దీంతో గులాబీ ప్రభుత్వం బీజేపీ సర్కారుపై ఒంటికాలిమీద లేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం ఉత్తచేయి చూపిందనీ, తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించిందని ఇటు ముఖ్యమంత్రి, అటు మంత్రులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సర్కారు ప్రతిష్టాత్మంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర పథకాలకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడిగింది. పలుమార్లు స్వయంగా సీఎం, మంత్రులు ప్రధాని మోడీతోపాటు ఇతర కేంద్ర మంత్రులనూ కలిశారు. వినతిపత్రాల మీద వినతిపత్రాలు సమర్పించారు. అయినా కేంద్రం కనికరించలేదు. కొత్తగా నయాపైసా విదిల్చలేదు.
సమాలోచనలు
కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సర్కారు సమాలోచనలో పడింది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల కొనసాగిం పుపై ఒకింత ప్రగతిభవన్లో చర్చ జరిగినట్టు సమాచారం. కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినరోజు సీఎం కేసీఆర్ సైతం తీవ్రంగా స్పందించారు. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ బీజేపీని మూడున్నర గంటలపాటు నిలదీశారు. మంత్రులు సైతం ఎక్కడికక్కడ ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రస్తుతం మొత్తం రూ.3 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు సమాచారం. దీనికి ప్రతియేటా దాదాపు రూ.14 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నది. ఇందులో 50శాతం మేర సాగునీటి ప్రాజెక్టుల వడ్డీలకే చెల్లిస్తున్నట్టు తెలిసింది.
ఇప్పుడెలా ..?
బడ్జెట్లో కేంద్రం చిప్ప చేతికిచ్చిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికే నిర్మాణం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను కొనసాగించాల్సిన అవసరం ఉంది. పలు పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగింది. అయినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే యాక్సిలరేటేడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రొగ్రామ్(ఏఐబీపీ) పథకం వచ్చే నిధులకూ కోత పెట్టింది. గతంలో ఈ పథకానికి రూ.నాలుగు వేల కోట్లకుపైగా వచ్చేవి. ఇప్పుడు వాటిని రూ.రెండు వేల కోట్లకు కుదించింది. ఏఐబీపీ పథకం కూడా యూపీఏ సర్కారు చేపట్టిన పథకమే కావడం గమనార్హం. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సర్కారుకు సవాల్ కానుంది. మళ్లీ అప్పులు తెచ్చుకోకతప్పదని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.
సేకరణ ఎలా ?
ప్రభుత్వం సాధారణంగా అప్పులు చేయాలంటే ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం వ్యవహారం నడపాల్సిందే. ఆ నిబంధనలకు మించి అప్పులు చేస్తే కేంద్రం అంగీకరించదు. వాణిజ్య బ్యాంకులు, ఆర్బీఐ, ఆర్థిక బాండ్ల విడుదల ద్వారా ఇప్పటిదాకా సేకరిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామసాగర్ ప్రాజెక్టులకు ఇప్పటికే అప్పులు చేసింది. వేల కోట్లు ఖర్చుపెట్టింది. వాటికి వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నది. ప్రారంభించిన ప్రాజెక్టులను మధ్యలో వదిలేయడం రాజకీయంగా ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉంది. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులకు కొంతమేర సొంతంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అయితే వాటిని ఎక్కడి నుంచి సేకరించాలి? మళ్లీ బ్యాంకుల నుంచే అప్పులు తేవాలా ? నాబార్డు ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదించాలా? అనే విషయంలో సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖలో చర్చ నడుస్తున్నది.
1.20 లక్షల కోట్లు అవసరం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి భారీగా నిధులు అవసరమని ఇటు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, అటు సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. వాటికి దాదాపు రూ. 1.20 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందనీ, అప్పుడే చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి సత్ఫలితాలు వస్తాయని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1.05 వేల కోట్లు అవసరం. ఇప్పటివరకు రూ.65 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.40 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. పాలమూరు-రంగారెడ్డికి లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా రూ. 80 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ రూ.20వేల కోట్లు పెట్టారు. ఇంకా రూ.60 వేల కోట్లు తప్పనిసరిగా అవసరమే. సీతారామాసాగర్ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కావాలి. ఇకపోతే చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు మరో రూ. నాలుగు వేల కోట్లు అవసరమని అధికారుల చెబుతున్నారు.
వచ్చే రెండేండ్లల్లో పూర్తికాకపోతే..
ఈ ప్రాజెక్టులు వచ్చే రెండేండ్లల్లో పూర్తిచేయకపోతే ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నాయని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. నిధులు విడుదల చేసి సకాలంలో పనులు ముగించకపోతే అంచనా వ్యయాలు మరింత పెరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఎస్ఎస్ఆర్ రేట్లూ పెరుగుతాయి. రీడిజైన్లు చేయడం సైతం వ్యయం పెరగడానికి కారణమవుతున్నది. గతంలో ఒక్కో ప్రాజెక్టు పూర్తికావడానికి 15 నుంచి 20 ఏండ్లు పట్టేది. దాంతో నిధుల అంచనాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పెంచాల్సి వచ్చింది. కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టు రికార్డుస్థాయిలో మూడేండ్లల్లో పూర్తిచేయగలిగింది. పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ప్రకారం వేగంగా పనులు పూర్తిచేస్తేనే ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉన్నట్టు సమాచారం.