Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమైతే పరిరక్షణకు మరో మిలియన్ మార్చ్
- టీజేఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరంకుశ పాలనకు అడ్డొస్తుందనే ఉద్ధేశంతోనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నారని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమాన్ని నిర్మిస్తామనీ, అవసరమైతే మరో మిలియన్ మార్చ్‌కు సన్నద్ధమవుతామని వారు హెచ్చరించారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమజిగూడా ప్రెస్ క్లబ్లో ''రాజ్యాంగ పరిరక్షణ సదస్సు'' సోమవారం జరిగింది. ఈ సదస్సుకు టీజేఎస్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు అధ్యక్షత వహించగా టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండ రామ్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ డెవలప్ మెంట్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళీ, మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, అంబేద్కర్‌వాది, సామాజిక వేత్త జె.బి.రాజు, తెలంగాణ విద్య వంతుల వేదిక ప్రతినిధి నాగయ్య, పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, డాక్టర్ కుమార్ ముస్లీం లీగ్ నాయకులు మహ్మద్ అబ్దుల్ కమాల్‌తో పాటు పలు ప్రజా సంఘాలు, సామాజిక నేతలు హాజరయ్యారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదనీ, కేసీఆర్‌ను మార్చాలని, రాజకీయంగా ఆయనను సమాధి చేస్తామని తెలిపారు. సీఎం కెసిఆర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పని చేస్తామనీ, అన్ని గొంతులన్నీ ఒకే నినాదంతో ముందుకెళ్తామన్నారు. హిందూత్వశక్తులకు తాను ప్రతినిధి అని చెప్పుకునేందుకే కేసీఆర్ రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేశారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ ఏనాడూ పూల దండ వేసి గౌరవించలేదనీ, ఇంకెన్నాళ్లు దళితుడు రాసిన రాజ్యాంగాన్ని భరించాలనే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారన్నారు. రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఒక్కరే రాయలేదనీ, ప్రజలందరూ రాశారని, ఉన్నత కులాల వారు కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ప్రజాప్రతినిధులైన వారు ఆయా రాజకీయ పార్టీలకు చెంచాలుగా మారారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చే అధికారం రాష్ట్ర పతికి, పార్ల మెంటుకు కూడా లేదనీ, కేవలం సవరణలకే అవకాశం ఉందన్నారు.