Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉంటుందా..?
- బీజేపీ నేతలే అసలైన దేశ ద్రోహులు...
- ఆ పార్టీది గతంలో జై శ్రీరాం..ఇప్పుడు జై భీమ్ నినాదం
- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఒక సీఎం రాజ్యాంగాన్ని మార్చాలని కోరితే... రాత్రికి రాత్రే దాన్ని మార్చే పరిస్థితి ఉంటుందా..? అసలు అలా సాధ్యమవుతుందా...? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు వీలుగా గతంలో వాజ్‌పాయి హయాంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిటీని ఏర్పాటు చేసింది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల బీజేపీ నేతలే పచ్చి దేశద్రోహులని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, క్రాంతి కిరణ్‌తో కలిసి బాల్క సుమన్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని తొలగించాలంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గతంలో వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలా...? అని ప్రశ్నించారు. గతంలో జై శ్రీరాం అంటూ నినదించిన కమలం పార్టీ నాయకులు, నేడు ఎన్నికల్లో ఓట్లు దండుకోవటానికి జైభీమ్ అంటూ నినదిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనేక మంది బీజేపీ నేతలు...అంబేద్కర్‌ను విమర్శించారనీ, వారందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. అందువల్లే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్కోదాన్నీ ప్రయివేటీకరిస్తూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సింగరేణి ప్రయివేటీకరణకు పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాలొచ్చే ఆ సంస్థను ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే కార్మికులను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు.