Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలనీ, లేదంటే రాజ్యాంగాన్ని గౌరవించే అన్ని వర్గాల ప్రజలతో కలిసి కేసీఆర్‌పై పోరాటం చేస్తామని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం అంబేద్కర్‌కు పాలభిషేకంతోపాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల వైఫల్యాలను రాజ్యాంగం మీద నెడుతున్నారని విమర్శించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తాననీ, గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, బీసీలకు చట్ట సభల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఇస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేసారనీ, వాటిని అమలు చేయటానికి రాజ్యాంగం ఏ విధంగా అడ్డుపడిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం మార్చాలనే అంశం మీద ఎన్నికలకు పోయే దమ్ముందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చే అంశం మీదనే ఎన్నికలకు రావాలనీ, రాజ్యాంగాన్ని పరి రక్షించాలనే అంశం మీద ఎన్నికలకు తామూ వస్తామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో కేసీఆర్ అహంకారంపై తీర్పు వస్తుందన్నారు. తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కొత్త నాటకానికి తెర తీశారని చెప్పారు. ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వం కొనసాగించాలని ఆయన కలలుగంటున్నాడని విమర్శించారు. తెలంగాణలో దొరతనాన్ని సాగనివ్వబోమని హెచ్చరించారు. ఈ పోరాటం కేసీఆర్ నియంతత్వానికి, అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరాటంగా సాగుతున్నదన్నారు. కేసీఆర్‌ని రాజకీయంగా ఓడించటం ద్వారానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగమని అన్నారు. కనుక రాజ్యాంగాన్ని కోరుకునే శక్తులన్ని ఏకం కావాలని కోరారు.