Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోరీ, కాల్పుల నిందితుల అరెస్ట్
- అప్పులు తీర్చేందుకే చోరీ
- వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కేసును ఛేదించారు. కాల్పులు, చోరీ ఘటన కేసులో ప్రధాన నిందితుడు రాజు, సాయి కుమార్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. సోమవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత వెల్లడించారు. జనవరి 31న సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డ్రైవర్‌పై కాల్పులు జరిపి కారులో ఉన్న రూ.43 లక్షలు నిందితులు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితులు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోలుకి చెందిన గజ్జె రాజు, ఆయన బంధువైన యాదాద్రి భువనగిరి జిల్లా బండ్లగూడకి చెందిన ఎడమ సాయికుమార్‌పై గతంలోనే పోక్సో కేసు నమోదు అయింది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి జైలుకూ పంపారు. 2021 సెప్టెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు.. ఖర్చులు, చెడు అలవాట్లతో అయిన అప్పులు ఏదైనా నేరం చేసి వచ్చిన డబ్బుతో తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద డబ్బులు ఈజీగా చేతులు మారుతాయనీ, ముఖ్యంగా నెల చివర్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతాయని తెలుసుకొని ఆరోజే దొంగతనం చేయాలని పథకం వేశారు. అంతకుముందు సిరిసనగండ్లలో దొంగలించిన పల్సర్ బైక్‌పై ఇద్దరు కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు జనవరి 31న వచ్చి రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ నలుగురు వ్యక్తులు నగదు ఉన్న రెడ్ కలర్ బ్యాగును డ్రైవర్‌కు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలికి వెళ్లడాన్ని గమనించారు. డ్రైవర్ డోర్ అద్దాన్ని కొద్దిగా దించుకుని ఫోన్లో మాట్లాడుతు న్నది గమనించి..రాజు,సాయి బైక్‌పై వచ్చి కారు అద్దం దించాలని తుపాకీతో డ్రైవర్‌ను బెదింరించారు. డ్రైవర్ డోర్ తీయకుండా కారును స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కాల్పులు జరిపారు. అద్దాన్ని పగలగొట్టి నగదున్న బ్యాగును తీసుకొని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాఫ్తు ముమ్మరం చేసి వారం రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు.