Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం చేయాలని రోడ్డుపై బైటాయించిన గ్రామస్తులు
- ఆరుగంటల పాటు విద్యుత్‌కు అంతరాయం
- విద్యుద్ఘాతంతో మరో రైతు...
నవతెలంగాణ-నేరేడుచర్ల/ మర్రిగూడ
సబ్‌స్టేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఒకరు.. పొలానికి విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేస్తుండగా మరో రైతు విద్యుద్ఘాతానికి గురై మృతిచెందారు. దాంతో అధికారుల నిర్లక్ష్యంతో చనిపోయిన రైతు కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డు బైటాయించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం దిర్శించర్ల పరిధిలో గల 33/11సబ్‌స్టేషన్ దగ్గర విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేట్ జైపాల్ మరమ్మతు పనులు చేస్తున్నాడు. మరొకరి సహాయం అవసరం ఉండటంతో సబ్‌స్టేషన్ పక్కన గల పొలంలో యూరియా చల్లుతున్న రైతు గుండెబోయిన సతీష్(35)ను సహాయం చేయాలని కోరడంతో అక్కడకు వెళ్ళాడు. ఏబీ స్విచ్ పట్టుకొని ఆఫ్ చేయాలని కోరగా.. కానీ ఏబీ స్విచ్ ఆఫ్ చేయగానే విద్యుత్ షాక్ తగిలి సతీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. రైతుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే సతీష్ మృతిచెందాడని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సబ్‌స్టేషన్ ఎదుట నేరేడుచర్ల-జాన్‌పహాడ్ రోడ్డుపై మూడుగంటల పాటు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, అనంతు శ్రీనివాస్‌గౌడ్ మండల విద్యుత్ అధికారి పందిరి శ్రీనివాస్‌తో చర్చించి బాధిత కుటుంబానికి న్యాయం జరిపిస్తామని సూచించడంతో ధర్నా విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. రైతు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేస్తుండగా..
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజ్జలపురం గ్రామానికి చెందిన రొక్కం నర్సింహారెడ్డి(38) ఉదయం పొలానికెళ్లాడు. మోటారుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్కు ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు తీగ తగలడంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రైతుకు భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులున్నారు. రెండేండ్ల కిందట నర్సింహారెడ్డి అన్న కూడా మృతిచెందినట్టు తెలిసింది. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ గుత్తా వెంకటరెడ్డి తెలిపారు.