Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
మేడారం మహాజాతర సందర్భంగా ప్రయాణికులకు సేవలు అందించడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) మునిశేఖర్ తెలిపారు. హనుమకొండ బస్టాండ్‌లోని రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) కార్యాలయంలో మేడారంలో ఆర్టీసీ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సోమవారం సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మునిశేఖర్ మాట్లాడారు. ఈనెల 16 నుంచి మహాజాతర జరగనున్న క్రమంలో అవసరమైన రవాణా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సంస్థ పని చేస్తోందని చెప్పారు. ఆదాయం కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినా రేట్లు పెంచలేదని తెలిపారు. తొలిసారిగా 1968లో మేడారం జాతరకు 100 బస్సులతో సేవలు ప్రారంభించగా ప్రస్తుతం 3,845 బస్సులు నడపటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈనెల 13 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. గత జాతరలో 19.23లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకోగా ఈసారి సుమారు 21 లక్షల మంది కోసం ఏర్పాట్లు చేశామన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 2200 బస్సులుండగా 51 పాయింట్ల ద్వారా జనాన్ని మేడారానికి తరలిస్తామని, వరంగల్ నగరంలో 3 పాయింట్ల నుంచి 900 బస్సులు నడుస్తాయని వివరించారు. ప్రయివేట్ వాహనాలు నార్లాపూర్ వరకు మాత్రమే వెళ్తాయని, ఆర్టీసీ బస్సులు మేడారం వరకు వెళ్తాయని చెప్పారు. మూడు ఆంబులెన్స్‌లతో మెడికల్ సెంటర్‌నూ ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వరంగల్ ఆర్ఎం విజయభాస్కర్, చీఫ్ కంట్రోలర్ విజరుకుమార్, రీజనల్ మేనేజర్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.