Authorization
Sat April 05, 2025 12:18:27 am
- మద్దతు ధర లేక నష్టాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే రైతులకు కష్టాలు
- రాష్ట్ర ప్రభుత్వమైనా కొనుగోలు కేంద్రాలు తెరవాలి
- తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పసుపు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్లో ధరల పతనంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు పంటకు మార్కెట్లో డిమాండ్ రావాలంటే ఎగుమతులు కీలకమని గుర్తు చేశారు. స్థానిక బీజేపీ ఎంపీ అరవింద్ హామీనిచ్చినట్టుగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే.. పంటను ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు అవకాశముంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట ఎగుమతులకు పూనుకుంటే.. రైతులకు కొంత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులోని పసుపును సాగర్‌తో పాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ, ప్రజాసంఘాల నేతలు సోమవారం సందర్శించారు. మార్కెట్లోని రైతులు, హమాలీలు, మార్కెట్ కమిటీ కార్యదర్శితో మాట్లాడారు. రెండేండ్లుగా పంట దిగుబడి రావడం లేదని, ధరలు సైతం అమాంతం తగ్గిస్తున్నారని నాయకులతో రైతులు వాపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలు ఖర్చు పెట్టి సాగు చేస్తున్న పసుపు పంటతో రైతులకు నష్టాలే తప్ప లాభాలు రావడం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండేండ్లుగా దిగుబడి తగ్గిందని తెలిపారు. ఇటు మార్కెట్లోనూ జనవరి మొదటి వారంతో పోల్చితే ప్రస్తుతం క్వింటాకు రూ.2 వేలు ధర తగ్గిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఎలా పంటలు సాగు చేస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చిన ఎంపీ అరవింద్.. మాట తప్పారని విమర్శించారు. వాగ్ధానం చేసినట్టుగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే రైతులకు నష్టాలు వస్తున్నాయని అన్నారు. కేంద్ర సర్కారు బోర్డు ఏర్పాటు చేస్తే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేస్తే ఇటు రైతులకు గిట్టుబాటు ధర రావడంతో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా చొరవ తీసుకొని పసుపు దిగుబడులు సేకరించి ఎగమతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌బాబు, జిల్లా కార్యదర్శి నుర్జహాన్, రైతు సంఘం, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శులు పల్లపు వెంకటేశ్, పెద్ది వెంకట్రాములు, ప్రజా సంఘాల నాయకులు బొట్ల రాజు, సబ్బని లత, యేశాల గంగాధర్, శంకర్‌గౌడ్, గోవర్దన్, విఘ్నేష్, అనిల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.