Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెజిట్ విడుదలకే కేంద్రం పరిమితం
- ఆరు నెలలుగా తాత్సారం
- జాడలేని అపెక్స్ కౌన్సిల్ భేటీ
- వేగంగా సాగని వ్యవహారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇంకా కొలిక్కిరాలేదు. వీటికి సంబధించి కేంద్రంలోని బీజేపీ సర్కారు గెజిట్ విడుదల చేసి మిన్నకుండిపోయింది. వేగంగా సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి ఉన్నట్టు కనిపించడం లేదు. రకరకాల నిబంధనల పేరుతో తాత్సారం చేస్తున్నది. ఆరు నెలల దాటినా ఈ అంశంలో ఆశించిన వేగం లేదు. ప్రగతి అంతకన్నా లేదు. దీంతో సాగునీటి సమస్యల పరిష్కారం తీవ్ర ఆలస్యమవుతున్నది. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా తయారైంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ లేకపోవడంతో వివాదాలు దీర్ఘకాలికంగా కొనసాగుతూనే ఉన్నాయి. జాప్యం మూలంగా సమస్యల పరిష్కారం మరింత జఠిలమయ్యే ప్రమాదముంది. 2014లో యూపీఏ తెచ్చిన పునర్విభజన చట్టాన్ని అమలుచేయడం లేదు. దీంతో వివాదాలు ఎటూ తేలడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సాగునీటి పథకాలు, వాటి అనుబంధ కాంపొనెంట్లకు సంబంధించి జులై 15న కేంద్ర జలశక్తి శాఖ జారిచేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండు రాష్ట్రాల్లోనూ వివాదాస్పదమైంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమన్య బోర్డు(జీఆర్ఎంబీ) పరిధిలోకి రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు తీసుకురావాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే ఆ గెజిట్‌పై రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉన్నాయి. గెజిట్‌ను అమలుచేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, కేంద్రం మాత్రం గెజిట్‌ను అమలుచేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతున్నది. అంతేగాక మరిన్ని షరతులు పెట్టింది. వాటిపైనా తెలుగు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. సమన్యను పరిష్కరించమంటే నిబంధనలు, మార్గదర్శకాల పేరుతో కేంద్రం కొత్త సమస్యలను సృష్టిస్తున్నదనే విమర్శలు అంటున్నాయి. ఇప్పటికే రెండు బోర్డులు ఇరురాష్ట్రాల్లో పర్యటించాయి. ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించాయి. సబ్కమిటీలతోనూ భేటి అయ్యాయి. సమాచారం తీసుకున్నాయి. బోర్డుల పరిధిలో సమస్య కొలిక్కివచ్చే అవకాశం కనిపించకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ భేటి తప్పనిసరని తెలంగాణ సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జీఆర్ఎంబీ పరిధిలో ఎలాంటి వివాదాలు లేకున్నా ప్రాజెక్టులు అప్పగించాలనడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే ఆక్షేపించింది. అయినా కేంద్రం ససేమిరా అనడంతో ఆ బోర్డు పరిధిలోని ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధమైంది. అలాగే కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు అభ్యంతరం లేదని చెబుతున్నది. కాగా గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన ఐదు నెలల తర్వాత డిసెంబరు 28న రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల భేటి ఆన్లైన్లో జరిగింది. అయినా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తాము కేంద్రం అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తున్నామని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు చెబుతుండగా, అడిగిన సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వాల నుంచి సహకారం ఉండటం లేదని కేంద్రం చెబుతున్నది. అలాగే ఆయా ప్రాజెక్టుల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్ఎఫ్)ను ఏర్పాటు చేయడం, రెండు బోర్డులకు రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీ డిపాజిట్ చేయడం, గెజిట్ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలనడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను సమర్పించాలంటూ చెబుతున్నది. డీపీఆర్‌లను రాష్ట్రాలు సమర్పించాయి. అసలే గత మూడేండ్ల ముందు నుంచే ఆర్థిక సంక్షోభం ఉండటంతో బోర్డులకు రూ. 200 కోట్ల చొప్పున కేటాయించడం కుదరదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుతం ఉంది. గెజిట్ అమలుతోపాటు వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్రాల జలవనరులు, సాగునీటి శాఖల ఉన్నతాధికారులు అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈమేరకు ఇరు రాష్ట్రాలను సమన్వయం చేసి అపెక్స్ కౌన్సిల్‌ను నిర్వహించడంలో కేంద్రం విఫలమవుతున్నది.