Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుమారుడితో సహా భార్యాభర్తలు మృతి
నవతెలంగాణ-చొప్పదండి
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో విషాద ఘటన జరిగింది. చేనేత కార్మికుడు భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ వంశీకృష్ణ, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాట్నపల్లి గ్రామానికి చెందిన బైరి శంకరయ్య(54)-జమున(50)కు ఇద్దరు కుమార్తెలు అనిత, అఖిల, కొడుకు శ్రీధర్(25) సంతానం. శంకరయ్య చేనేత వృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు. ఆరేండ్ల కిందట పెద్ద కుమార్తె పెండ్లి చేశారు. గత నవంబర్లో చిన్న కుమార్తె వివాహం జరిగింది. కొడుకు శ్రీధర్ హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి చిన్న కుమార్తె అఖిల తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. మళ్లీ సోమవారం ఉదయం ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అనుమానంతో ఇంటి పక్కనే ఉండే గ్యాజంగి రామయ్యకు ఫోన్ చేసింది. తమ తల్లిదండ్రులు ఫోన్ ఎత్తడం లేదని, ఇంటికెళ్లి చూడాలని కోరింది. రామయ్య శంకరయ్య ఇంటికి వెళ్లి తలుపు నెట్టి చూడగా.. ముగ్గురూ ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వంశీకృష్ణ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్న కుమార్తె అఖిల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సుంకెరవి
ఎమ్మెల్యే రవిశంకర్ కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించారు. చేనేత కార్మికుని కుటుంబం ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. చేనేత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, క్షణికావేశంలో ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు.