Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తీవ్ర ఇబ్బందులు
- ప్రయివేటు వైద్యానికి వెళ్లలేక అవస్తలు
- 104 వైద్యసేవల స్వస్తికి ప్రభుత్వం యత్నం..?
- ఆందోళనలో రోగులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మందు గోలీలు అందక వ్యాధి తీవ్రతతో సతమతమవుతున్నారు. ప్రయివేటుగా మందులు కొనుగోలు చేసే స్తోమతలేని రోగులు మంచాన పడుతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెల రోగులకు మందులు అందించే 104 వైద్యసేవలు కరోనా పేరుతో నిలిపి వేయడంతో రోగులు అల్లాడిపోతున్నారు. మందు గోలీల కోసం కిలో మీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీ, సీహెచ్సీ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమయానికి అక్కడ సైతం మందులు లేకపోతే.. ఉసూరుమంటూ వెనుదిరుగాల్సి వస్తోందని రోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే 104 వైద్య సేవలను పునరుద్ధరించి మా ప్రాణాలు కాపాడాలని రోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 104 వైద్యసేవలు 14 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం సేవలు అందిస్తోంది. ఒక్కో వాహనంలో ల్యాబ్ టెక్నిషియన్, పార్మసిస్టు, నర్సులు, ఆ గ్రామ ఆశావర్కర్లు ఉంటారు. వీరు ప్రతి నెలా ఆయా గ్రామాలకు వెళ్లి రక్తపోటు, మధుమేహం, మూర్ఛ, అస్తమా, చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేసేవారు. షుగర్, బీపీ, రక్త పరీక్షలు నిర్వహించేవారు. 104 సేవలు పొందేవారు.. ఒక్కో గ్రామంలో సుమారు 30 నుంచి 50 మంది వరకు ఉంటారు. వీరంతా ప్రయివేటులో మందులు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేనివారు. ఉదాహరణకు నందిగామ మండలం పిట్టలవాడి గూడెంలో ప్రభుత్వం ఇచ్చే మందు గోలీలు మింగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నవారు సుమారు 25 మంది, జనరల్ వైద్యం పొందేవారు 30 మంది ఉన్నారు. వీరంతా ప్రతి నెలా తమ గ్రామానికి వచ్చే 104 వాహనం వద్ద ఇచ్చే మందులు వాడేవారు. ప్రస్తుతం కోవిడ్-19 నెపంతో రెండేండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 104 సేవలు నిలిపివేయడంతో రోగులు వైద్యసేవలకు దూరమయ్యారు.
'104'కు స్వస్తి చెప్పే యోచనలో ప్రభుత్వం..?
ఏఎన్ఎంలతో ఇంటింటికీ తిరిగి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల సర్వే చేసి.. వారికి వైద్యసేవలు అందించేందుకు ఇటీవల ఎన్సీడీ కార్యక్రమం తీసుకువచ్చారు. దాంతో ప్రభుత్వం మొత్తానికే 104 వైద్యసేవలు అవసరం లేదన్న ధోరణిలో ఉన్నట్టు వైద్యశాఖలో చర్చ నెలకొంది. రెండేండ్లుగా ఇప్పటికే మందు గోలీల కోసం నానా తిప్పలు పడ్డ రోగులు.. 104 సేవలు బంద్ పెడితే మా ఆరోగ్యాన్ని కాపాడే దిక్కేలేకుండా పోతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏండ్ల నుంచి కొనసాగుతున్న 104 వైద్యసేవలు యధావిధిగా కొనసాగించాలని రోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణం పోయేట్టు ఉంది
సర్కారు మందు గోలీలు ఇచ్చే సరికి ప్రాణం పోయేట్టుంది. ఏడాదిగా మందులు సకాలంలో ఇవ్వడం లేదు. ఒక నెల దొరికితే మరో నెల దొరకడం లేవు. కరోనాకు ముందు గ్రామ పంచాయతీ దగ్గర ఇచ్చేవారు. ఇప్పుడు ఆశావర్కర్ ఇంటికి పోయి తెచ్చుకోవాల్సి వస్తోంది. చేతనై.. చేతగాక కర్ర సాయంతో వెళ్లినా ఆమె దగ్గర మందులు ఎప్పుడూ ఉండవు. ఆ మందులు వచ్చేసరికి.. నేను కాటికి పోయేట్టు ఉన్నా. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలే..
-దాసరి లక్షమ్మ, రోగి కోడిచర్ల గ్రామం
రోగం పెరిగిపోతుంది
పదేండ్లుగా షుగర్ వ్యాధితో బాధ పడుతున్నా.. ప్రయివేటులో మందులు కొనలేక సర్కారు ఇచ్చే మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న. కరోనా వచ్చిన నుంచి ఊరిలోకి 104 బండి వస్తలేదు.. మందులిస్తలేరు. ఆశావర్కర్ను అడిగితే ఎప్పుడో ఒకసారి రెండు, మూడు గోలీలు ఇస్తోంది. సర్కారు ఆస్పత్రికి పోయినా.. అక్కడా మందులు దొరకడం లేవు.. రోజు రోజుకు షుగర్ పెరుగుతుంది. ప్రయివేటులో మందులు కొద్దామంటే చేతిలో డబ్బులు లేవు. సర్కారు మందు గోలీలు ఇచ్చి మా ప్రాణాలు కాపాడాలి.
- ఎలుక వెంకటమ్మ , షుగర్ రోగి, పెంజర్ల గ్రామం, కొత్తూరు మండలం